మస్క్ వారానికి 120 పనిగంటలపై నెటిజన్ల విమర్శలు
వీకెండ్స్‌లో పని చేయడాన్ని ‘సూపర్‌పవర్’గా అభివర్ణించిన టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలన్ మస్క్..సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు.
టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) ఉద్యోగులు వారానికి 120 గంటలు పనిచేస్తున్నారని పేర్కొనడం సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వృథా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా అమెరికా (USA) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ DOGE శాఖను ఏర్పాటుచేశారు. ఈ శాఖ బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు అప్పగించారు.
‘సూపర్‌పవర్’..
వీకెండ్స్‌లో పని చేయడాన్ని ‘సూపర్‌పవర్’గా అభివర్ణించిన మస్క్.. వారానికి కేవలం 40 గంటలు పనిచేయడం వల్ల "బాగా అలసిపోతున్నారు" అంటూ ప్రభుత్వ ఉద్యోగులనుద్దేశించి వ్యంగ్యంగా అన్నారు. వీకెండ్ రాగానే పని మానేయడం.. మ్యాచ్ ఆడుతున్న జట్టు క్రీడాకారులు ఒక్కసారిగా ఫీల్డ్ వదిలేయడం లాంటిదని పేర్కొన్నారు.
ఇటు మస్క్ వ్యాఖ్యలపై సోషయల్ మీడియా వేదికగా నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. ఒకరు ఆయన “టెర్రిబుల్ బాస్” అని, 120 గంటల పని చేస్తున్నా DOGE వెబ్‌సైట్ ఖాళీగానే ఉంటొందని మరొకరు ట్విట్ చేశారు. ఇంకొకరు మరీ లెక్కలు వేసి నిజంగా 120 గంటలు పనిచేయడం సాధ్యమేనా? మస్క్‌ని ప్రశ్నించారు. మరో యూజర్..“ రెండు రోజులు సెలవు తీసుకుంటే, మిగతా 5 రోజుల్లో రోజుకు 24 గంటలు పనిచేస్తారా?” అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. DOGEని ఎలన్ మస్క్ అలియన్లు, రోబోలతో కలిసి నడుపుతున్నారా? లేక ఆయన కేవలం తాను గొప్ప అని చెప్పుకోడానికి ఇదంతా చెబుతున్నారా?" అంటూ ఇంకొకరు కోట్ చేశారు. దీర్ఘకాల పనివేళలతో విజయాలు సాధించలేం. సమయానికి విలువ ఇస్తూ నిర్ణయాలు ఎలా తీసుకుంటారన్నదే కీలకం అని మరొకరు రిప్లై ఇచ్చారు.
నెపోలియన్‌తో పోలిక..
కొంతమంది మస్క్‌ని నెపోలియన్‌తో పోల్చారు. ఆయనకు అపారమైన మేధస్సు, అపరిమిత శక్తి ఉన్నాయని ప్రశంసించారు. DOGEలో అసమర్థత, అవినీతిని తొలగించడం తన లక్ష్యమని మస్క్ గతంలో స్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే. 2026 జూలై 4న అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని DOGEను మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక అమలు చేయనున్నట్టు ప్రకటించారు.
ఇటీవల లార్సన్ & టుబ్రో (L&T) చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని సూచించారు. ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూడా 70 గంటల పని వారాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు వారి వరసనే మస్క్ చేరిపోయారు.