
అన్నామలై వ్యాఖ్యలపై మహారాష్ట్రలో రాజకీయ దుమారం..
“ముంబై మహారాష్ట్ర నగరం మాత్రమే కాదు, ఇది ఒక అంతర్జాతీయ నగరం” - బీజేపీ తమిళనాడు మాజీ చీఫ్
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై(Mumbai) మరోసారి రాజకీయ తుఫాన్‌కు కేంద్రబిందువైంది. బ్రిహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ‘ముంబై గుర్తింపు’ అంశం రాజకీయ అజెండాలో అగ్రస్థానానికి చేరింది. ఈ వివాదానికి కారణం — భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమిళనాడు నేత కే. అన్నామలై(K Annamalai) చేసిన వ్యాఖ్యలు. ఆయన “ముంబై మహారాష్ట్ర నగరం మాత్రమే కాదు, ఇది ఒక అంతర్జాతీయ నగరం” అని పేర్కొనడం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపింది.
ముంబైలో ప్రచార కార్యక్రమంలో అన్నామలై ప్రసంగించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం, మహారాష్ట్రలో బీజేపీ మిత్రపక్షాల ప్రభుత్వం, BMCలో కాషాయ పార్టీ పాలన అవసరమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ‘బాంబే’ అనే పాత పేరును ఉపయోగించడం, నగరాన్ని ‘గ్లోబల్ సిటీ’గా వర్ణించడం మరాఠీ ప్రాంత భావోద్వేగాలను రెచ్చగొట్టాయి. ఫలితంగా శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకెరే వర్గం), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) నేతలు తీవ్రంగా స్పందించారు.
వివాద నేపథ్యం..
ముంబై కేవలం ఒక నగరం మాత్రమే కాదు. ఇది దేశంలోనే అత్యంత ధనిక మునిసిపల్ కార్పొరేషన్. BMC వార్షిక బడ్జెట్ రూ. 40 వేల కోట్ల నుంచి రూ. 75 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ కారణంగానే ముంబై మునిసిపల్ పాలనపై అన్ని ప్రధాన రాజకీయ పార్టీల దృష్టి ఉంటుంది.
థాకరే సోదరుల కౌంటర్..
అన్నామలై వ్యాఖ్యలపై MNS అధినేత రాజ్ థాకెరే స్పందించారు. ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. “ముంబై ఎవరిది అనే ప్రశ్నే లేదు. ఇది మహారాష్ట్రదే” అంటూ స్పష్టం చేశారు. భాష, భూమి, ఉపాధి అంశాలను మళ్లీ రాజకీయ వేదికపైకి తెచ్చే ప్రయత్నం రాజ్ థాకెరే ప్రసంగాల్లో స్పష్టంగా కనిపించింది. అటు శివసేన (UBT) నేత ఉద్ధవ్ థాకెరే కూడా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ముంబై పేరు గుర్తింపును మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
జనవరి 11న దాదర్‌లోని శివాజీ పార్క్‌లో శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) సంయుక్తంగా నిర్వహించిన ర్యాలీలో ఎంఎన్‌ఎస్ అధినేత రాజ్ థాకెరే నేరుగా బీజేపీ నేత కే. అణ్ణమలైను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“తమిళనాడు నుంచి ఒక ‘రసమలై’ వచ్చాడు. ముంబైకి, మహారాష్ట్రకు సంబంధమేంటని ప్రశ్నిస్తున్నాడు. అసలు నీకు ఇక్కడ ఏ సంబంధం ఉంది?” అని రాజ్ థాకెరే వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో ఆయన శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకెరే చెప్పిన ‘హటావో లుంగీ, బజావో పుంగీ’ అనే నినాదాన్ని ప్రస్తావించారు. మొత్తంమీద అన్నామలై వ్యాఖ్యలతో ముంబై గుర్తింపు, ప్రాంతీయ భావోద్వేగాల అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది.
అన్నామలై వివరణ..
తనపై వస్తున్న విమర్శలకు అన్నామలై సమాధానమిచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, తాను ముంబై అభివృద్ధి గురించే మాట్లాడానని స్పష్టం చేశారు. ముంబై ఒక ప్రపంచ నగరమని చెప్పడం ద్వారా దాని ప్రాధాన్యతను తగ్గించలేదని, దేశ ఆర్థిక పురోగతిలో ముంబై పాత్రను గుర్తుచేశానని అన్నారు. థాకేరీలు తనను రాజకీయంగా బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. “భయపడే ప్రశ్నే లేదు” అంటూ బహిరంగ సవాలు విసిరారు.

