
ముంబై: రెండో రోజూ భారీగా క్యూ కట్టిన ఆటోలు..
దెబ్బతిన్న CNG ప్రధాన పైప్‌లైన్.. చార్జీలను పెంచేసిన ఆటోడ్రైవర్లు..
ముంబై(Mumbai), పరిసర ప్రాంతాల్లోని CNG పంపుల వద్ద రెండో రోజు కూడా ఆటోలు, ట్యాక్సీలు బారులుతీరి కనపడ్డాయి. సోమవారం (నవంబర్ 17) మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) పైప్‌లైన్ దెబ్బతినడంతో గ్యాస్ (CNG Crisis) సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో నిన్న, ఈ రోజు ఆటోరిక్షాలు, టాక్సీలు, CNGతో నడిచే వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఫలితంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే ముంబై వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మధ్యాహ్నానికి పూర్తి..
ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతానికి గ్యాస్ సరఫరా చేసే 389 CNG పంపులలో దాదాపు 60 శాతం లేదా 225 మాత్రమే పనిచేస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి పైప్‌లైన్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని MGL తెలిపింది.
చార్జీలను పెంచిన ఆటోవాలాలు..
ఆటోలు తక్కువ సంఖ్యలో నడుస్తుండడంతో ఇదే అవకాశంగా భావించిన డ్రైవర్లు చార్జీలను పెంచేశారు. దూరప్రాంత ప్రయాణాలకు డబ్బులు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. సాధారణం కంటే రెట్టింపు చార్జీ లాగుతున్నారు.
CNG కొరత కారణంగా ఉబర్, రాపిడో, ఇతర క్యాబ్ సేవలు చాలావరకు తగ్గాయని వినియోగదారుడొకరు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘రూ. 89 మాత్రమే చూపించే రూట్లలో ఆటో డ్రైవర్లు రూ. 150- రూ. 200 డిమాండ్ చేశారు. అధికారులు జోక్యం చేసుకోవాలి’’ అని మరో వినియోగదారుడు కోరారు.
సమీపంలోని మెట్రో స్టేషన్‌కు చేరుకోవడానికి ఆటోవాలాలు ఏకంగా రూ.500 వరకు వసూలు చేస్తున్నాయని మరో వ్యక్తి హిందూస్తాన్ టైమ్స్‌తో అన్నారు.
కిక్కిరిసిన బస్సులు..
CNG రిక్షాలు, క్యాబ్‌లు వీధుల్లో కనిపించకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సులకు తాకిడి పెరిగింది. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) బస్సులు కిక్కిరిసాయి. కుర్లా, చెంబూర్, శాంతాక్రూజ్, అంధేరి, సియోన్‌లోని స్టాపుల వద్ద భారీ క్యూలు దర్శనమిచ్చాయి. అప్పటికే నిండిపోయిన బస్సులను ఎక్కడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
కుర్లా నుంచి కలీనాలోని యూనివర్సిటీ వెళ్తున్న విద్యార్థిని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ఆటోలు అందుబాటులో లేకపోవడంతో దాదాపు 30 నిమిషాలు బస్ స్టాప్‌లో నిలిచిపోయా.“ఎక్కడా ఆటోలు లేవు. బస్సులు నిండిపోయాయి, బలవంతంగా రద్దీగా ఉన్న బస్సులో ప్రయాణించాల్సి వచ్చింది. సాధారణంగా 15 నిమిషాలు పట్టే ప్రయాణం దాదాపు 40 నిమిషాలు పట్టింది” అని చెప్పారు.
మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్కు ముంబై ఆటోరిక్షా-టాక్సీమెన్స్ అసోసియేషన్ అధిపతి లేఖ రాశారు. CNG కొరత వల్ల ఎక్కువ గంటలు బంకుల వద్ద వేచి ఉండటం వల్ల డ్రైవర్లు కోల్పోయిన రెండు రోజుల ఆదాయానికి MGL పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసినట్లు HT నివేదించింది.
"నేను తెల్లవారుజామున 4 గంటల నుంచి CNG బంకు వద్ద క్యూలో ఉన్నా. నా కంటే ముందు చాలా టాక్సీలున్నాయి. నా వంతు ఎప్పుడు వస్తుందో తెలీదు.’’ అని టాక్సీ డ్రైవర్ సీతారాం రాజక్ PTI కి చెప్పారు.
తాత్కాలికంగా CNG స్టేషన్ల మూసివేత..
ముంబైలో దాదాపు 130-140 CNG స్టేషన్లు ఉన్నాయి. గ్యాస్ సరఫరా లేకపోవడంతో కొంతమంది స్టేషన్ యజమానులు తమ దుకాణాలను తాత్కాలికంగా మూసేశారు.
ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెంపు..
CN ఆటోలు, క్యాబ్‌ల రాకపోకలు తగ్గడంతో.. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. 1,273కిపైగా ఎలక్ట్రిక్ బస్సులు, నాలుగు మెట్రో లైన్లు, సబర్బన్ రైలు నెట్‌వర్క్‌లను అందుబాటులోకి తెచ్చింది.
‘అద్దె మోపెడవుతుంది’
గ్యాస్ కొరత కారణంగా దాదాపు 2వేల స్కూల్ బస్సులు రోడ్లపైకి రాలేదని, దీంతో ఆపరేటర్లు ప్రైవేట్ కాంట్రాక్టర్ల నుంచి బస్సులను రూ.12,000 చొప్పున అద్దెకు తీసుకుని 10 కిలోమీటర్ల దూరం రెండు ట్రిప్పులు నడపాల్సి వస్తుందని స్కూల్ బస్ ఆపరేటర్ల సంఘం నాయకుడు అనిల్ గార్గ్ పేర్కొన్నారు.

