బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధిపతిగా మహ్మద్ యూనస్
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశం వీడి భారత్ చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేసి యూనస్‌ను తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా నియమించారు.
తప్పనిసరి పరిస్థితుల్లో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత రోజే (ఆగస్టు 6) బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ పార్లమెంటును రద్దు చేసి నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్‌ను తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా నియమించారు. 84 ఏళ్ల యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి సారథ్యం వహించడానికి అంగీకరించినట్లు తెలిసింది. బంగాభబన్ (ప్రెసిడెన్షియల్ ప్యాలెస్)లో త్రివిధ దళాల అధిపతులు, విద్యార్థి సంఘాల నాయకులతో అధ్యక్షుడు షహబుద్దీన్ జరిపిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపుల అనంతరం తాత్కాలిక ప్రభుత్వంలోని ఇతర సభ్యులను ఖరారు చేస్తామని రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ Md. జాయ్నల్ అబెదిన్ తెలిపారు.
హిందూ దేవాలయాలు ధ్వంసం..
హసీనా దేశం విడిన తర్వాత బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాకాండలో అనేక హిందూ దేవాలయాలు, గృహాలను ధ్వంసం చేశారు. మహిళలపై దాడులు జరిగాయి. అవామీ లీగ్ పార్టీతో సంబంధాలున్న భావిస్తున్న ఇద్దరు హిందూ నేతలు మరణించారని సమాచారం.
మోదీ ఆమెకు సమయం ఇచ్చారు..
సోమవారం భారత్‌లో అడుగుపెట్టిన హసీనాను కట్టుదిట్టమైన భద్రత మధ్య రహస్య ప్రదేశానికి తరలించారు. మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రభుత్వం హసీనాకు సాయం చేస్తుందని హామీ ఇచ్చారని చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించడానికి ఆమెకు కొంత సమయం ఇచ్చారని పేర్కొన్నారు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జూలై 15 నుంచి కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మరణించిన వారి సంఖ్య 440కి పెరిగింది.
అసలు ఘర్షణలకు కారణమేంటి?
పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించేందుకు 1971 లిబరేషన్ వార్‌లో పాల్గొన్న సైనికుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30% కోటా కల్పించాలని 1972లో హసీనా తండ్రి, ప్రధానమంత్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రభుత్వం నిర్ణయించి అమలు చేసింది. అయితే 2018 అక్టోబర్‌లో విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో.. షేక్ హసీనా ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను రద్దు చేసింది. అయితే ఈ కోటాను పునరుద్ధరించాలని 2024 జూన్‌లో హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజా విచారణ అనంతరం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 93 శాతం ఉద్యోగాలను మెరిట్ ఆధారంగా ఇవ్వాలని, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు 5 శాతం, మైనార్టీలకు 1 శాతం, వికలాంగులు, థర్డ్ జెండర్‌లకు 1 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు తీర్పుతో దేశంలో నిరసనలు తగ్గకపోగా మరింత తీవ్రమయ్యాయి. దీంతో విద్యార్థుల ఆందోళన కారులపై హసీనా ఉక్కుపాదం మోపింది. సుమారు 440 మంది నిరసనకారులు మరణించారు. దీంతో ఆందోళనకారులు దృష్టి రిజర్వేషన్లు నుంచి హసీనాను గద్దె దింపడం వైపు మళ్లింది.