BJP | ప్రధాని మోదీ గేమ్ ఛేంజర్ అవుతారా?
x

BJP | ప్రధాని మోదీ గేమ్ ఛేంజర్ అవుతారా?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆదివారం జపనీస్ పార్క్‌లో ఏర్పాటుచేసిన ‘‘పరివర్తన్ ర్యాలీ’’లో ప్రధాని మోదీ కొన్ని ముఖ్యమయిన ప్రకటనలు చేయనున్నారు.


ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే ఓటర్లకు హామీలిచ్చేశాయి. ఆ వరుసలో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ముందంజలో ఉంది. తాము అధికారంలోకి రాగానే మహిళలకు నెలకు రూ. 2,100 చెల్లిస్తామని, పురోహితులకు గౌరవ వేతనం రూ. 18వేలు ఇస్తామని ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటించారు. ఆప్‌ ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూడా ఈ సారి గెలుపుపై ఆశలు పెట్టుకుంది. ఈ సారి ఎన్నికలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. అందుకే ఆదివారం ఢిల్లీ ఉత్తర-పశ్చిమ ప్రాంతంలోని రోహిణిలో జపనీస్ పార్క్‌లో "పరివర్తన్ ర్యాలీ" ఏర్పాటుచేశారు. ఇందులో ప్రధాని పాల్గొంటున్నారు. కొన్ని ముఖ్యమయిన ప్రకటనలు కూడా చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

"మోదీ (PM Modi) ఈ ర్యాలీలో కొన్ని కీలక ప్రకటనలు చేయనున్నారు. ఇవి మా పార్టీ ప్రచారానికి బాగా ఉపయోగపడతాయని భావిస్తున్నాం,’’ అని ఢిల్లీ బీజేపీ(BJP)లోని ఒక కీలక అధికారి తెలిపారు. ఇప్పటికే ఆప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన "ఉచిత" పథకాలన్నింటిని అధికారంలోకి వస్తే తాము కూడా కంటిన్యూ చేస్తామని బీజేపీ స్పష్టం చేసింది.

పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ..

ప్రధానమంత్రి శుక్రవారం ఢిల్లీలో పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఇవి కూడా బీజేపీ ఎన్నికల ప్రచారానికి పనికొస్తాయని భావిస్తున్నారు. మోదీ శుక్రవారం జెజె కాలనీ వాసుల కోసం 1,675 ఫ్లాట్లు, అశోక్ విహార్‌లో నగర పునర్నిర్మాణ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. నజఫ్గఢ్‌లోని రోషన్ పురాలో వీర్ సావర్కర్ కాలేజీకి భూమిపూజ చేయనున్నారు. ఈ కాలేజీకి తూర్పు ఢిల్లీలో ఒక అకడమిక్ బ్లాక్, ద్వారకాలో మరో అకడమిక్ బ్లాక్ నిర్మించనున్నారు.

70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది. 1998 నుంచి ఢిల్లీలో బీజేపీ డీలాపడిపోయింది. అప్పటి నుంచి అధికారంకోసం ప్రయత్నిస్తూనే ఉంది.

Read More
Next Story