‘సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని ఆనాడు వ్యతిరేకించారు’
x

‘సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని ఆనాడు వ్యతిరేకించారు’

‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ సందర్భంగా రాజకీయ దుమారం రేపుతున్న ప్రధాని వ్యాఖ్యలు..


Click the Play button to hear this message in audio format

సోమనాథ్ దేవాలయం(Somnath temple) పునర్నిర్మాణం జరిగి వెయ్యేళ్లు పూర్తైన సందర్భంగా గుజరాత్‌లో నిర్వహించిన ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ(Nehru)పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సోమనాథ్ దేవాలయ ధ్వంసం వెనుక ఉన్న చారిత్రక నిజాలను కొందరు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని ఆరోపించారు. సోమనాథ్ దేవాలయాన్ని కేవలం సంపద కోసమే దోచుకున్నారని కొంతమంది చరిత్రకారులు ప్రచారం చేశారని మోదీ అన్నారు. అయితే వాస్తవంగా ఆ దాడుల వెనుక భారతీయ సంస్కృతి, ఆత్మగౌరవాన్ని ధ్వంసం చేయాలన్న ద్వేష భావన దాగి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిజాలను దాచిపెట్టేందుకు అప్పట్లో ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు.

సోమనాథ్ చరిత్ర కేవలం విధ్వంసానికి సంబంధించినది కాదని, ఇది ధైర్యసాహసాలు, త్యాగం, సంకల్పానికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. వెయ్యేళ్ల తర్వాత కూడా ఆలయ శిఖరంపై ఎగురుతున్న జెండా భారతీయ శక్తికి, మొక్కవోని దీక్షకు సాక్ష్యమని అన్నారు. తమ పూర్వీకులు విశ్వాసం, వారసత్వాన్ని కాపాడుకోవడానికి ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగఫలమే నేటి మన ఆత్మగౌరవమని మోదీ కొనియాడారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో పాల్గొనడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని ఆయన తెలిపారు.

సోమనాథ్ ఆలయాన్ని ఆక్రమణదారుల నుంచి రక్షించడానికి వీర్ హమీర్జీ గోహిల్, వేగ్దాజీ భిల్ వంటి అనేక మంది ధైర్యవంతులు తమ ప్రాణాలను త్యాగం చేశారని మోడీ గుర్తు చేసుకున్నారు. "కానీ, దురదృష్టవశాత్తు వారికి తగిన గుర్తింపు లభించలేదు. వాస్తవానికి, కొంతమంది చరిత్రకారులు, రాజకీయ నాయకులు ఈ దండయాత్రల చరిత్రను కప్పిపుచ్చడానికి కూడా ప్రయత్నించారు" అని చెప్పారు మోదీ.

1951లో సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణం పూర్తైన సమయంలో అప్పటి ప్రధాని నెహ్రూ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని మోదీ గుర్తుచేశారు. స్వతంత్ర భారతదేశ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఈ దేవాలయ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మద్దతు లభించలేదని ఆయన సూచించారు. ఆ కాలంలో ఉన్న పాలకులు దేశ సంస్కృతి, సంప్రదాయాల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబించారని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం వచ్చాక ఆలయాన్ని పునర్నిర్మించడానికి ఉక్కుమనిషి సర్దార్‌ పటేల్‌ చేసిన ప్రయత్నాలను కొందరు అడ్డుకున్నారని విమర్శించారు. భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నప్పుడు అభ్యంతరాలు వ్యక్తంచేశారని ధ్వజమెత్తారు.

ప్రధాని వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. బీజేపీ నేతలు మోదీ వ్యాఖ్యలను సమర్థిస్తూ..కాంగ్రెస్ పార్టీ తన పాలనలో దేశ సంస్కృతిని నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం చరిత్రను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని బీజేపీపై విమర్శలు చేస్తోంది.

Read More
Next Story