
బీహార్ సీఎం నితీష్ క్యాబినెట్‌లో బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు
ప్రధాన ప్రత్యర్థి రాష్ట్రీయ జనతా దళ్‌ను ఎదుర్కోడానికి బీజేపీ-జెడీయూ కూటమి పావులు కదుపుతోంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) క్యాబినెట్ విస్తరణ(Cabinet Expansion)తో బుధవారం (ఫిబ్రవరి 26) ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలను మంత్రిపదవులు దక్కాయి. ఇటు బీహార్ బడ్జెట్ సమావేశాలు, అటు అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. మంత్రులుగా ఎమ్మెల్యేలయిన సంజయ్ సరావగి, సునీల్ కుమార్, జీబేష్ కుమార్, రాహుల్ కుమార్ సింగ్, మోతీ లాల్ ప్రసాద్, విజయ్ కుమార్ మండల్, కృష్ణన్ కుమార్ మాంటూతో బీహార్ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ పాట్నాలోని రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు.
క్యాబినెట్ విస్తరణ తర్వాత మంత్రివర్గ బలం 30కి పెరిగింది. వీరిలో బీజేపీ మంత్రులు 15 మంది కాగా, జేడీయూ మంత్రులు 13 మంది, హిందుస్తాని అవామ్ మోర్చా మంత్రి ఒకరు, స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు. ఇంకా ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
జైస్వాల్ రాజీనామా..
దిలీప్ జైస్వాల్ రెవెన్యూ మంత్రిపదవికి రాజీనామా చేశారు. బీజేపీ సిద్ధాంతం "ఒక వ్యక్తికి – ఒక పదవి’’ కట్టుబడి ఆయన తప్పుకున్నారు. తనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించడంపై కేంద్ర నాయకత్వానికి జైస్వాల్ ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నికల వ్యూహంలో భాగంగానే..
క్యాబినెట్ విస్తరణకు ముందే నితీష్ కుమార్ కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఇప్పటికే కొంతమంది మంత్రుల దగ్గర చాలాశాఖలున్నాయి. వాటిలో కొన్నింటిని కొత్త మంత్రులకు అప్పగించే అవకాశం ఉంది.
ప్రధాన ప్రత్యర్థి రాష్ట్రీయ జనతా దళ్ (RJD) ఎదుర్కోడానికి ఇప్పటి నుంచే బీజేపీ-జెడీయూ కూటమి పావులు కదుపుతోంది. అందులో భాగంగానే బీజేపీ-జెడీయూ కూటమి అన్ని వ్యవస్థలను చక్కదిద్దాలని చూస్తోంది.