మెదక్ బిగ్ ఫైట్ : ఇందిరమ్మ నాటి పూర్వవైభవం కోసం కాంగ్రెస్ ఆరాటం
ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ ఎంపీ నియోజకవర్గంలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ ఆరాట పడుతోంది.ఈ సీటు కైవసం కోసం బీఆర్ఎస్, బీజేపీ యత్నిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఇందిరాగాంధీ...తెలంగాణ ప్రముఖ కాంగ్రెస్ నేత ఎం బాగారెడ్డి...బీజేపీ టైగర్ గా పేరొందిన ఆలె నరేంద్ర, ప్రముఖ సినీనటి విజయశాంతి,గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాంటి యోధులు ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో మూడు పార్టీల అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన నీలం మధును రంగంలోకి దించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఐఎఎస్ అధికారి, ఎమ్మెల్సీ అయిన వెంకట్రామిరెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బరిలో నిలిచారు. అంతర్జాతీయంగా పేరొందిన మెదక్ చర్చ్ సాక్షిగా పార్లమెంట్ పోరు ఆసక్తికరంగా మారింది.
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో 16.7 శాతం ఉన్న ఎస్సీ ఓటర్లు, 8.9 శాతం ఉన్న ముస్లిం ఓటర్లే కీలకపాత్ర పోషించనున్నారు. 4.3శాతం మంది ఎస్టీ ఓటర్లు, 1.13 శాతం మంది క్రైస్తవ ఓటర్లు ఉన్నారు. ఎస్సీ,ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ మైనారిటీల ఓటర్లు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేల బలమున్నా,పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
మెదక్ పార్లమెంట్ నుంచి ఎందరో మహామహులైన నేతలు ప్రాతినిధ్యం వహించారు. ఆలె నరేంద్ర, విజయశాంతి, కేసీఆర్ ఇక్కడి ఎంపీలుగా విజయఢంకా మోగించారు. ఆలె నరేంద్ర 2004వ సంవత్సరంలో అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరి రెండోసారి ఎంపీగా విజయం సాధించారు. 2009వ సంవత్సరంలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి ఆ పార్టీ అభ్యర్థినిగా సినీనటి విజయశాంతి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2014 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గులాబీ బాస్ కేసీఆర్ ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.
త్రిముఖ పోరు
మూడు పార్టీల తరపున కీలక నేతలు ఎన్నికల్లో పోటీ పడుతుండటంతో మెదక్‌లో త్రిముఖ పోరు నెలకొంది. చిట్కూల్ గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన నీలం మధు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆపై కాంగ్రెస్ కండువా కప్పుకున్న మధు అలా పార్టీలో చేరి ఇలా అభ్యర్థి అయ్యారు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే అయిన రఘునందన్ రావు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, మళ్లీ ఎంపీ బరిలో దిగారు. ఐఎఎస్ అధికారిగా ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్సీ అయిన వెంకట్రామిరెడ్డి మొదటిసారి పార్లమెంట్ బరిలో దిగారు.
హైదరాబాద్ నగరానికి రెండు వైపులా విస్తరించి ఉన్న మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో అక్షరాస్యుల శాతం 53.97గా ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల సమాహారంతో కూడిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మెదక్, సిద్దిపేట, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరు, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
త్రిముఖ పోరు: నీలం మధు(కాంగ్రెస్),రఘునందన్ రావు(బీజేపీ), వెంకట్రామిరెడ్డి(బీఆర్ఎస్)
బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేల బలం
బీఆర్ఎస్ పార్టీకి మెదక్ సిట్టింగ్ ఎంపీ స్థానం కావడంతోపాటు ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల బలం ఉంది. ఒక్క మెదక్ అసెంబ్లీ సెగ్మెంటులోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనంపల్లి రోహిత్ విజయం సాధించారు. గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మెదక్ పార్లమంట్ పరిధిలోని గజ్వేల్ సెగ్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిద్ధిపేట నుంచి తన్నీరు హరీష్ రావు, నర్సాపూర్ నుంచి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, సంగారెడ్డి నుంచి చింతా ప్రభాకర్, పటాన్ చెరు నుంచి గూడెం మహిపాల్ రెడ్డి, దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆరుగురు ఎమ్మెల్యేల బలం మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో ఏమేర ప్రభావం చూపిస్తుందనేది ఫలితాల్లో తేలనుంది.
గత ఎన్నికల ఓట్ల శాతంలో బీఆర్ఎస్ పార్టీనే ఆధిక్యం
2023 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వచ్చిన ఓట్ల శాతాన్ని విశ్లేషిస్తే బీఆర్ఎస్ ముందుంది. బీఆర్ఎస్ పార్టీ 46.7 శాతం ఓట్లు సాధించి ఆరు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 29.3 శాతం ఓట్లతో రెండోస్థానానికి పరిమితమైంది. బీజేపీ 14.7 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, గ్యారంటీల అమలు లాంటివి ప్లస్ పాయింట్లుగా మారవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి 52.5 శాతం ఓట్లతో విజయ దుందుభి మోగించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 24.6 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. బీజేపీకి అసెంబ్లీ కంటే పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగ్గా అంటే 17.7 శాతం ఓట్లు దక్కాయి. దీంతో బీజేపీ మూడో స్థానంలోనే నిలచింది.
ఎస్సీ ఓటర్లే కీలకం
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో 16.7 శాతం ఉన్న ఎస్సీ ఓటర్లు, 8.9 శాతం ఉన్న ముస్లిం ఓటర్లే కీలకపాత్ర పోషించనున్నారు. 4.3శాతం మంది ఎస్టీ ఓటర్లు, 1.13 శాతం మంది క్రైస్తవ ఓటర్లు ఉన్నారు. ఎస్సీ,ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ మైనారిటీల ఓటర్లు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేల బలమున్నా,పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
మెదక్ ఎంపీగా గెలిచి ప్రధాని అయిన ఇందిరాగాంధీ
1980వ సంవత్సరంలో జరిగిన మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ (ఐ) పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇందిరాగాంధీ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అయిన అప్పటి జనతాపార్టీకి చెందిన ఎస్ జైపాల్ రెడ్డిపై ఇందిరాగాంధీ 2,19,124 ఓట్ల ఆధిక్యతతో గెలిచి ప్రధానమంత్రి అయ్యారు.
కాంగ్రెస్ కంచుకోట మెదక్‌లో బీఆర్ఎస్ పాగా
గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రాతినిథ్యం వహించారు. అనంతరం వరుసగా నాలుగుసార్లు 1989,1991,1996,1998 సంత్సరాల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం బాగారెడ్డి విజయం సాధించడంతో మెదక్ పార్లమెంట్ స్థానం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. కానీ 1999 సాధారణ ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆలె నరేంద్ర అనూహ్య విజయం సాధించి కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టారు.
మెదక్ ఎంపీలుగా మహామహులు...
మెదక్ పార్లమెంట్ నుంచి ఎందరో మహామహులైన నేతలు ప్రాతినిధ్యం వహించారు. ఆలె నరేంద్ర, విజయశాంతి, కేసీఆర్ ఇక్కడి ఎంపీలుగా విజయఢంకా మోగించారు. ఆలె నరేంద్ర 2004వ సంవత్సరంలో అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరి రెండోసారి ఎంపీగా విజయం సాధించారు. 2009వ సంవత్సరంలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి ఆ పార్టీ అభ్యర్థినిగా సినీనటి విజయశాంతి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2014 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గులాబీ బాస్ కేసీఆర్ ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.
మెదక్‌లో పూర్వవైభవం తీసుకుని వద్దాం : సీఎం రేవంత్ రెడ్డి
మహానాయకురాలు ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానం తమకు ప్రతిష్ఠాత్మకమని, ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటులో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ ఛార్జిలు కార్యకర్తలతో కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి నివాసంలో మెదక్ పార్లమెంట్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, బీజేపీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని ఇదే అదనుగా నాయకత్వమంతా కలిసికట్టుగా పనిచేసి మెదక్ సీటును కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే విధంగా కృషి చేయాలని రేవంత్ కోరారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల అమలుతో ప్రజల్లో పార్టీ పట్ల సానుభూతి పెరిగింది, ప్రచారంలో మన పథకాలే ప్రచారస్త్రాలుగా వినియోగించుకొని విజయం సాధించాలి’’ అని రేవంత్ సూచించారు. ఈ సమావేశానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు మెదక్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గల ఇన్ చార్జిలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.
Next Story