
బీహార్‌లో భారీ పోలింగ్: మధ్యాహ్నం 3 గంటల సమయానికి 60.40 శాతం పోలింగ్
20 జిల్లాల్లోని 122 నియోజకవర్గాల్లో పోలింగ్ - మొత్తం అభ్యర్థులు 1,302 - 3.7 కోట్లకు పైగా ఓటర్లు
బీహార్‌లో రెండో దఫా ఎన్నికలలో కూడా అత్యధిక శాతం పోలింగ్ నమోదయ్యింది. 122 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం (నవంబర్ 11) పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం ఓటర్లు 3.7 కోట్ల మంది కాగా మధ్యాహ్నం 3 గంటల సమయానికి 60.40 శాతం పోలింగ్ నమోదయ్యింది.
కిషన్‌గంజ్‌లో అత్యధికంగా 66.10 శాతం నమోదు కాగా.. పూర్నియా (64.22 శాతం), కతిహార్ (63.80 శాతం) జముయి (63.33 శాతం) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. తొలి దశలో 121 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో 65 శాతానికిపైగా ఓటింగ్ నమోదయిన విషయం తెలిసిందే.
చిన్నపాటి ఘర్షణ..
మంగళవారం బీహార్‌లోని నవాడా జిల్లాలోని వారిసాలిగంజ్ ప్రాంతంలోని ఒక పోలింగ్ కేంద్రం సమీపంలో పార్టీల నాయకుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. "పోలింగ్ కేంద్రం నుంచి 1.5 కి.మీ దూరంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఘర్షణ పడ్డారు. అయితే అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. ఓటింగ్ సజావుగా జరుగుతోంది" అని నవాడా పోలీసు సూపరింటెండెంట్ అభినవ్ ధీమాన్ పీటీఐకు చెప్పారు. ఎన్నికల విధులకు వాడే ప్రభుత్వ వాహనం దెబ్బతినిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. దెబ్బతిన్న వాహనం ప్రైవేట్ వాహనం అని, దానికి ఎన్నికల విధులకు ఏ సంబంధం లేదని స్పష్టం చేశారు.
భద్రత పెంపు..
రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు బీహార్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశామని, ఎన్నికల విధుల్లో 4 లక్షలకు పైగా సిబ్బంది నిమగ్నమై ఉన్నారని అధికారులు తెలిపారు.
బరిలో ప్రముఖులు..
ప్రముఖ అభ్యర్థులలో ప్రముఖ జేడీ (యూ) నాయకుడు, రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత సీనియర్ సభ్యుడు బిజేంద్ర ప్రసాద్ యాదవ్ ఉన్నారు. ఈయన ఎనిమిదోసారి తన సుపాల్ స్థానాన్ని నిలుపుకోవాలని చూస్తున్నారు. 1990 నుంచి వరుసగా ఏడుసార్లు గెలిచిన గయా టౌన్ నుంచి బీజేపీకి చెందిన ఆయన క్యాబినెట్ సహోద్యోగి ప్రేమ్ కుమార్ పరిస్థితి కూడా అంతే. బీజేపీకి చెందిన రేణు దేవి (బెట్టియా), నీరజ్ కుమార్ సింగ్ “బబ్లూ” (ఛాతాపూర్), జేడీ(యూ)కి చెందిన లేషి సింగ్ (ధమ్దహా), షీలా మండల్ (ఫుల్పరాస్), జమా ఖాన్ (చైన్పూర్) ఎన్నికల బరిలో ఉన్నారు.చమరో ప్రముఖ బీజేపీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్ పోటీలో ఉన్నారు. ఆయన వరుసగా ఐదోసారి కతిహార్ స్థానం పోటీ చేశారు.
కతిహార్ జిల్లా బలరాంపూర్, కడ్వా అసెంబ్లీ స్థానాల నుంచి వరుసగా సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, కాంగ్రెస్ శాసనసభా పార్టీ నాయకులు మెహబూబ్ ఆలం, షకీల్ అహ్మద్ ఖాన్ పోటీ చేశారు. వీరిద్దరూ హ్యాట్రిక్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎన్డీఏ సభ్యుల్కు లిట్మస్ పరీక్ష..
NDA చిన్న భాగస్వాములైన కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహా రాష్ట్రీయ లోక్ మోర్చాకు బల పరీక్షగా కూడా కనిపిస్తోంది, ఈ రెండూ గతంలో చెరో ఆరు స్థానాలను గెలుచుకున్నాయి.
రెండో దశలో 45వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు..
రెండవ దశలో 45,399 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరిగింది. వీటిలో 40,073 గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. సగానికి పైగా ఓటర్లు (2.28 కోట్లు) 30 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు. 18-19 సంవత్సరాల వయస్సు ఉన్న వారు 7.69 లక్షలు మాత్రమే. 122 నియోజకవర్గాల్లో మొత్తం మహిళా ఓటర్ల సంఖ్య 1.75 కోట్లు. ఫలితాలు 14వ తేదీ వెలువడతాయి.

