
మరాఠీ తర్వాతే మిగతా భాషలన్నీ: డిప్యూటీ సీఎం అజిత్ పవార్
హిందీని తప్పనిసరి చేస్తూ ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు హిందీ భాషను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడులో జాతీయ విద్యా విధానం, హిందీ భాషాకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే జరుగుతోంది. అయితే మహారాష్ట్ర(Maharashtra)లో మాతృభాష మరాఠీ(Marathi)కే తొలి ప్రాధాన్యం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మరాఠీ, ఇంగ్లీష్-మీడియం పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు మూడో భాషగా హిందీ తప్పనిసరి అని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అవగాహన లేకనే..
హిందీ భాష వద్దంటున్న ప్రతిపక్షాలకు పవార్(Ajit Pawar) గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. గురువారం పింప్రి చించ్వాడ్‌లో చాపేకర్ సోదరులకు అంకితం చేసిన జాతీయ స్మారక చిహ్నాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. "కొంతమంది తమకు వేరే పని లేక హిందీ భాషపై వివాదాలు సృష్టిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ భాషను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇక చాలా రాష్ట్రాల్లో హిందీ మాట్లాడతారు.’’ అని పేర్కొన్నారు.
మరాఠీ భాషను ప్రోత్సహించడంలో కేంద్రం పాత్రను హైలైట్ చేస్తూ.. "మరాఠీకి శాస్త్రీయ భాష హోదా కల్పించడంపై ఢిల్లీలో ఏళ్ల తరబడి పెండింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే మరాఠీకి శాస్త్రీయ భాష హోదా కల్పించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే(PM Modi)." అని గుర్తు చేశారు. ముంబైలో మరాఠీ భాషా భవన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.