
మరాఠాలకు రిజర్వేషన్లకు మనోజ్ జరంగే నిరాహార దీక్ష
షరతులతో అంగీకరిస్తేనే అనుమతిస్తామన్న పోలీసులు..
OBC కింద తమ కమ్యూనిటీకి 10 శాతం రిజర్వేషన్లు(Reservations) కల్పించాలని డిమాండ్ చేస్తూ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిరవధిక నిరాహార దీక్ష(Hunger strike)కు పూనుకున్నారు.
మరాఠా(Maratha) కోటా ఉద్యమ నాయకుడు మనోజ్ జరంగే. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు దీక్ష విరమించనని ప్రతిజ్ఞ చేశారు. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో దీక్ష వేదికకు చేరుకున్న 43 ఏళ్ల జరంగేకు ఆయన మద్దతుదారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
‘వెనక్కు తగ్గను'
మరాఠీ సమాజాన్ని రెచ్చగొట్టవద్దని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను హెచ్చరించిన జరంగే.. తనను కాల్చి చంపినా..తమ డిమాండ్లు నెరవేరే వరకు తనతో పాటు మద్దతుదారులు ఇక్కడ నుంచి కదలరని అన్నారు. "మా డిమాండ్లు నెరవేరే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. కాల్చి చంపినా నేను వెనక్కి తగ్గను" అని స్పష్టం చేశారు.
‘ఒక్క రోజు మాత్రమే అనుమతి’
రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మరాఠీ సమాజం ముంబైలో (Mumbai) గుమిగూడాల్సి వచ్చిందని చెప్పారు. దురదృష్టవశాత్తూ రాష్ట్ర ప్రభుత్వం నిరాహార దీక్ష చేపట్టేందుకు ఒక రోజు మాత్రమే అనుమతి ఇచ్చిందని, పొడిగింపునకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నానని చెప్పారు.
'పోలీసులకు సహకరించాలి'
నిరసన వల్ల ముంబై వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వోదని తన మద్దతుదారులను చెప్పారు. పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తన మద్దతుదారులు వాహనాలను నిర్ణీత ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాలని కోరారు.
శాంతియుతంగా తనకు మద్దతు తెలపాలని, ముంబైలో జరుగుతున్న గణేష్ ఉత్సవాలకు ఎలాంటి అంతరాయం కలిగించవద్దన్నారు.
అంతర్వాలి నుంచి పాదయాత్రగా..
జల్నా జిల్లాలోని తన గ్రామం అంతర్వాలి సారథి నుంచి వందలాది వాహనాలతో పాదయాత్రను ప్రారంభించిన జరంగేకు.. ముంబైలోకి ప్రవేశించగానే వాషి వద్ద మద్దతుదారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన ఆజాద్ మైదాన్‌కు బయలుదేరారు. అయితే జల్నా పోలీసులు జరంగే, ఆయన మద్దతుదారులకు షరతులతో కూడిన పాదయాత్రకు అనుమతించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించవద్దని, అభ్యంతరకరమైన నినాదాలు చేయకూడదని పోలీసులు ఆదేశించారు.
పోలీసుల షరతులు..
జరంగే మద్దతుదారులు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) సమీపంలో ఉదయం భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడిందని పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆజాద్ మైదాన్‌లో శాంతియుత నిరసనకు అనుమతి ఇచ్చిన పోలీసులు.. సాయంత్రం 6 గంటలకు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని కోరారు.
ఆజాద్ మైదాన్ వైపు నిరసనకారుల ఐదు వాహనాలు మాత్రమే వెళ్లాలని, అక్కడ నిరసనకారుల సంఖ్య 5వేలకు మించకూడదని పోలీసులు షరతు పెట్టారు.