మీ వద్దకు సీఎంలా కాదు.. ‘దీదీ’లా వచ్చాను.
x

మీ వద్దకు సీఎంలా కాదు.. ‘దీదీ’లా వచ్చాను.

జూనియర్ డాక్టర్లు ఆందోళన వీడి, విధులకు హాజరయ్యేందుకు పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ చివరి ప్రయత్నం చేశారు. నేరుగా వారి వద్దకే వెళ్లి మాట్లాడారు.


పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక మెట్టు దిననెట్టే కనిపిస్తోంది. కోల్ కతా ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో ఆగస్టు 9న ఒక ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన యావత్ ప్రపంచాన్ని దిభ్రాంతికి గురిచేసింది. దేశ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల నిరసనలు వెల్లువెత్తాయి. కోల్‌కతాలో మాత్రం ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ జూనియర్ డాక్టర్ విధులకు నెల రోజుల నుంచి హాజరుకావడం లేదు. గత మూడు రోజులుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం స్వాస్థ్య భవన్ బయట ఆందోళన చేస్తున్నారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి, నిరసన తెలుపుతున్న జూనియర్ వైద్యులకు మధ్య ప్రతిష్టంభనకు తెర పడాలని భావించిన మమతా బెనర్జీ.. తన భద్రతా సిబ్బంది హెచ్చరికలను కూడా లెక్కచేయకుండా శనివారం నేరుగా స్వాస్థ్య భవన్ వద్దకు చేరుకున్నారు. తాను ఇక్కడకు ముఖ్యమంత్రిగా కాదు.. 'దీదీ'గా (అక్కగా) మాత్రమే వచ్చానని చెప్పారు.

మీ డిమాండ్లపై నిర్ణయం తీసుకున్నా ..

“నేను కూడా విద్యార్థి ఉద్యమం నుంచే వచ్చాను. చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. వర్షాల మధ్య వైద్యులు రోడ్డుపై నిరసన చేస్తుండడంతో నేను “నిద్రలేని రాత్రులు గడిపాను. గత 33-34 రోజులుగా వైద్యుల నిరసనకు "కాపలాదారు"గా ఉన్నా. నేను మీకు హామీ ఇస్తున్నాను. మీ సమస్యలు, డిమాండ్లను అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటా. నేను మాత్రమే ప్రభుత్వాన్ని నడపను. చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీ, డీజీపీ (డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్) అందరూ నా వెంట ఉన్నారు. దోషులకు కచ్చితంగా శిక్ష పడుతుంది ”అని మమత అన్నారు.

"నాకు కూడా న్యాయం కావాలి"

డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో నేను కూడా న్యాయాన్ని కోరుకుంటున్నా. సీబీఐ విచారణ త్వరగా పూర్తి చేయాలని, దోషులకు మరణశిక్ష విధించాలని నేను కూడా మీ తరపున డిమాండ్ చేస్తున్నా. రోగుల ప్రాణాలు కాపాడడం కూడా ముఖ్యమే. వైద్యులు విధులకు దూరంగా ఉండడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన వైద్యం అందక 23 మంది రోగులు మరణించారు. మీరు కూడా మా సోదర సోదరీమణులు. నేను మీకు ఎలాంటి అన్యాయం చేయనని హామీ ఇస్తున్నా.

మీపై ఎలాంటి చర్య తీసుకోను..

‘‘మీపై నాకు ఎలాంటి కక్ష లేదు. మీరు న్యాయం కోసం పోరాడుతున్నారు. నేను కూడా అదే జరగాలని కోరుకుంటున్నా. మీరు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. దోషులకు శిక్షించడానికి కొన్ని ప్రొసీడింగ్స్ జరగాలి. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. సెప్టెంబర్ 17న విచారణ ఉంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎస్మా (ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్) కింద చర్య తీసుకుంది. కాని నేను ఆ పని చేయను. విధులను హాజరుకావాలని మిమ్మల్ని కోరుతున్నా. నేను కూడా 26 రోజులు నిరాహారదీక్ష చేశాను [సింగూర్ నిరసన సమయంలో], కానీ అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం నుంచి ఎవరూ నాతో మాట్లాడటానికి రాలేదు". కాని నేను ఈ రోజు మీతో మాట్లాడటానికి వచ్చాను.’’ అని పేర్కొన్నారు.

రోగుల సంక్షేమ కమిటీని రద్దు చేస్తా..

ఆర్‌జి కర్‌తో సహా అన్ని మెడికల్ కాలేజీ ఆసుపత్రుల రోగుల సంక్షేమ కమిటీలను రద్దు చేస్తున్నట్లు మమతా ప్రకటించారు. ప్రిన్సిపాల్‌ చైర్మన్‌గా, జూనియర్‌, సీనియర్‌ వైద్యులు, నర్సులు, పోలీసులు, ప్రజాప్రతినిధుల ప్రతినిధులతో అన్ని కమిటీలను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

‘‘నిందితులు నా స్నేహితులు కాదు. వారిలో కొందరు నా స్నేహితులు అని మీరు అనుకుంటున్నారు. వాళ్లెవరో కూడా నాకు తెలియదు. వారికి మాతో ఎలాంటి లింకులు లేవు. నిందితులకు కఠిన శిక్ష పడేలా నా శక్తి మేర ప్రయత్నిస్తా.’’ అని చెప్పారు.

నిరసన తెలుపుతున్న వైద్యులతో చర్చలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కాని చర్చలు జరపడానికి ముందు వారు కొన్ని షరతులు పెట్టారు.

వైద్యుల ముందస్తు షరతులు..

రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వైద్యులను చర్చలకు ఆహ్వానించింది. అయితే తాము రాజీనామా చేయాలన్న కోరుతున్న ఆరోగ్య కార్యదర్శి నుంచి రావడంతో ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. బుధవారం చర్చలు జరగడానికి వైద్యులు కొన్ని షరతులు పెట్టారు. సమావేశానికి కనీసం 30 మందితో కూడిన ప్రతినిధి బృందాన్ని అనుమతించాలని, సమావేశానికి ముఖ్యమంత్రి హాజరుకావాలని, సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ పెట్టారు. ప్రత్యక్ష ప్రసారం మినహా మిగతా డిమాండ్లను రాష్ట్రం అంగీకరించింది. వైద్యులు మమత కోసం రెండు గంటల పాటు వేచిచూశారు. ఆమె హాజరుకాకపోవడంతో వెనుతిరిగారు. సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రోటోకాల్‌కు విరుద్ధంగా ఉంటుందని మమత తరువాత వివరించారు. మొత్తం మీద మమత పర్యటన నిరసన వైద్యులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Read More
Next Story