
‘బెంగాల్ S.I.Rను వెంటనే నిలిపివేయాలి’
CECని కోరిన పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ..
రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వెంటనే నిలిపేయాలని పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(CM Mamata Banarjee) ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను కోరారు. ‘ఏకపక్షంగా, లోపభూయిష్టంగా’ చేపడుతున్న ఈ ప్రక్రియను తక్షణం నిలిపేయాలని ఇప్పటికే ఆమె ఈసీకి లేఖ కూడా రాశారు. ఎటువంటి ప్రణాళిక, సన్నద్ధత లేకుండా ఎన్నికల కమిషన్ హడావుడిగా చేపట్టిన ఎస్‌ఐఆర్‌తో తీవ్రమైన అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు, పరిపాలనాపరమైన తప్పిదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. S.I.Rను ఇలాగే కొనసాగిస్తే అనేకమంది తమ ఓటుహక్కును కోల్పోతారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య పునాదులపైనే ఇదొక దాడిగా అభివర్ణించారు. ఏమాత్రం ప్రణాళిక, సన్నద్ధత లేకుండా తాత్కాలిక పద్ధతుల్లో, తీవ్ర అవకతవకలతో, విధాన ఉల్లంఘనలతో, పరిపాలనా లోపాలతో సర్‌ను ఈసీ కొనసాగిస్తోందని విరుచుకుపడ్డారు. ఇదివరకే తాను రెండు లేఖలు రాసిన విషయాన్ని గుర్తుచేస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్నాయని చెప్పారు. అందువల్లే తన ఆందోళనను తెలిపేందుకు మరో లేఖ రాయాల్సి వచ్చిందన్నారు. జాతీయస్థాయిలో సర్ లక్ష్యాలేమటో తెలియని స్థితిలో ఈసీ ఉందన్నారు.
‘సరైన శిక్షణ ఇవ్వలేదు ’
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొంటున్న అధికారులకు సరైన శిక్షణ లేదని, ఓటర్ల జాబితా సవరణకు వాడుతున్న సాఫ్ట్‌వేర్, ఐటీ వ్యవస్థలు సరైనవి కావని సీఎం మమత పేర్కొన్నారు. విధుల్లో ఉన్న సిబ్బందికి సరైన, ఒకే విధమైన శిక్షణ ఇవ్వలేదని ఆరోపించారు. ఎన్నికల సంఘం జారీ చేస్తున్న ఆదేశాలలో స్పష్టత కూడా లేదన్నారు. పరస్పర విరుద్ధ ఆదేశాల కారణంగా క్షేత్రస్థాయి సిబ్బందిలో గందరగోళం నెలకొందని తెలిపారు.

