
‘S.I.Rను వెంటనే నిలిపేయాలి’
కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..
పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(CM Mamata Banerjee) ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్‌కు డిసెంబర్ 3న లేఖ రాశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (S.I.R)ను వెంటనే నిలిపివేయాలని కోరారు. ఓటర్ల జాబితా పునఃసమీక్ష పేరుతో జరుగుతున్న S.I.Rలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే ప్రయత్నం జరుగుతోందని, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. S.I.R ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్య ప్రక్రియపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించిన మమత.. ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకుని ఈ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాల సవరణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.
SIR ప్రక్రియలో అవసరమైన మార్గదర్శకాలు పాటించడం లేదని మమత విమర్శించారు. ఇంటింటి సర్వేలు సక్రమంగా జరగడం లేదని, సరైన నోటీసులు ఇవ్వకుండా ఓటర్ల పేర్లు తొలగించే పరిస్థితి ఏర్పడిందని ఆమె లేఖలో వివరించారు. ఇది స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు.
ప్రస్తుతం బెంగాల్‌లో రాజకీయ పరిస్థితి సున్నితంగా ఉన్న నేపథ్యంలో ఈ తరహా చర్యలు ప్రజల్లో భయాందోళనలకు దారితీస్తున్నాయని మమత హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగ సంస్థగా వ్యవహరించి, అన్ని వర్గాల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని ఆమె గుర్తుచేశారు.

