TMC | బీజేపీ తప్పుడు ప్రచారం చేసిందన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమత
x

TMC | బీజేపీ తప్పుడు ప్రచారం చేసిందన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమత

"తప్పుడు కథనాలను ప్రచారం చేయడానికి బీజేపీ వాళ్లు చాలా డబ్బు ఖర్చు చేశారని నాకు తెలుసు. అబద్ధాలు దాగవు. వాస్తవాలు నిదానంగా వెలుగులోకి వస్తాయి." - మమతా బెనర్జీ


పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం సందేశ్‌ఖాలీలో పర్యటించారు. వివిధ సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె బీజేపీపై విరుచుకుపడ్డారు.

"తప్పుడు కథనాలను ప్రచారం చేయడానికి బీజేపీ వాళ్లు చాలా డబ్బు ఖర్చు చేశారని నాకు తెలుసు. అయినా దాని గురించి నేను పెద్దగా మాట్లాడను. అబద్ధాలు ఎక్కువ కాలం దాగవు. వాస్తవాలు నిదానంగా వెలుగులోకి వస్తాయి.’’ అని అన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు..

‘‘అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. మీరు ఎవరికీ డబ్బులు చెల్లించనక్కర్లేదు. ప్రభుత్వమే నేరుగా మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేస్తుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాగునీరు, ఆరోగ్యం, విద్య కోసం ఉత్తర 24 పరగణాలకు రూ. 23 వేల కోట్లు కేటాయించాం. సందేశ్‌ఖాలీ అభివృద్ధి చెందాలని, స్థానిక అమ్మాయిలు అబ్బాయిలు తమకు ఇష్టమైన రంగంలో రాణించాలని కోరుకుంటున్నా. ఇది అల్లర్ల ప్రదేశం కాదు. విధ్వంసాన్ని కోరుకోవడం లేదు. శాంతిని కోరుకుంటున్నాం." అని బెనర్జీ చెప్పారు.

సందేశ్‌ఖాలీ అసలు ఏం జరిగింది?

కోల్‌కతాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర 24 పరగణాస్‌లోని సందేశ్‌ఖాలీ అనే ద్వీపం వద్ద ఈ ఏడాది జనవరిలో సమస్యలు మొదలయ్యాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం టీఎంసీ లీడర్ షేక్ షాజహాన్ నివాసంలో సోదాలు నిర్వహించడానికి వెళ్ళినప్పుడు ఆయన మద్దతుదారులు వారిపై దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేశారు. కొన్ని వారాల తర్వాత ఫిబ్రవరిలో షేక్ షాజహాన్, ఆయన మద్దతుదారులపై భూకబ్జా, లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. దీంతో షాజహాన్‌ను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ, సీపీఐ (ఎం), కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. TMC షాజహాన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఫిబ్రవరి 29న అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

TMCదే పై చేయి..

లోక్‌సభ ఎన్నికల వరకు నిరసనలు కొనసాగాయి. ఎన్నికలలో TMC సత్తాచాటింది. TMC సీనియర్ నేత నూరుల్ ఇస్లాం బీజేపీ అభ్యర్థి రేఖ పాత్రపై గెలుపొందారు. ఇది TMCకి నిర్ణయాత్మక విజయం.

స్పందించిన రేఖ పాత్ర..

మమతా పర్యటనపై బీజేపీ నాయకురాలు రేఖా పాత్ర స్పందించారు. దాదాపు 11 నెలల తర్వాత ముఖ్యమంత్రి సందేశ్‌ఖాలీని సందర్శించడాన్ని ఆమె తప్పుబట్టారు. "ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి. చాలాకాలం క్రితమే ఈ సందర్శించాల్సి ఉంది." అని పేర్కొన్నారు.

Read More
Next Story