‘అధికారంలోకి రాగానే TMC నాయకుల అక్రమాలపై కమిషన్ ’
x

Suvendu Adhikari

‘అధికారంలోకి రాగానే TMC నాయకుల అక్రమాలపై కమిషన్ ’

పశ్చిమ బెంగాల్ శాసనసభా ప్రతిపక్ష నేత సువేందు అధికారి


పశ్చిమ బెంగాల్ (West Bengal) సీఎం మమత బెనర్జీ (Mamata Banerjee) వ్యాఖ్యాలకు శాసనసభ ప్రతిపక్ష నేత బీజేపీ(BJP) నాయకుడు సువేందు అధికారి (Suvendu Adhikari) కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన సందేశ్‌ఖాలీలో ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు రోజు (సోమవారం) టీఎంసీ చీఫ్ సందేశ్‌ఖాళీలో పర్యటించిన విషయం తెలిసిందే. అదే రోజు ఆమె పలు సంక్షేమ పథకాలను ప్రారంభించారు.

ర్యాలీనుద్దేశించి సువేందు మాట్లాడుతూ..“2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు సందేశ్‌ఖాలీలో మహిళలను అరెస్టు చేయడానికి మమత కుట్ర పన్నారు. TMC నాయకుడు షాజహాన్ షేక్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై కేసులు బనాయించి అరెస్టు చేయించారు. మా పార్టీ అధికారంలోకి రాగానే అవినీతి, అక్రమాలు, దారుణాలకు ఒడిగట్టిన తృణమూల్ నాయకులపై విచారణకు కమిషన్‌ ఏర్పాటు చేస్తాం,” అని చెప్పారు.

ED అధికారులపై దాడి..

2024 జనవరిలో కోట్లాది రూపాయల రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి సందేశ్‌ఖాలీలోని TMC నాయకుడు షేక్ షాజహాన్ (Sheikh Shahjahan) నివాసాన్ని తనిఖీ చేసేందుకు ED అధికారులు వెళ్లారు. అయితే వారిపై దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేశారు. అనంతరంషాజహాన్ షేక్, ఆయన అనుచరులు భూకబ్జాలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో 2024 ప్రారంభంలో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమయిన విషయం తెలిసిందే.

TMC నాయకుల దౌర్జన్యాలపై నిరసనలు వెల్లువెత్తిన తర్వాత సందేశ్‌ఖాలీలో మమత బెనర్జీ తొలిసారి సోమవారం పర్యటించారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మీ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని, అర్హులందరికీ అవి వర్తిసాయని చెప్పారు. స్థానిక మహిళలకు ఎవరైనా ఫోన్ చేస్తే పట్టించుకోవద్దని సూచించారు.

‘ముస్లిం ఓట్లతో గెలిచారు’

సందేశ్‌ఖాలీ అసెంబ్లీ నియోజకవర్గం బసిర్‌హత్ లోక్‌సభ వర్గ పరిధిలోకి వస్తోంది. ఇక్కడి నుంచి TMC తరుపున నూరుల్ ఇస్లాం గెలుపొందారు. బీజేపీ నుంచి రేఖా పాత్ర పోటీచేశారు. అయితే ముస్లిం ఓట్లతోనే TMC గట్టెక్కిందని సువేందు పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి కేంద్ర ప్రాజెక్టుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మారుస్తోందని, ఈ పథకాల కింద రాష్ట్ర ప్రజలకు ఆర్థిక సాయం అందకుండా పోయిందని ఆరోపించారు.

Read More
Next Story