
‘సుపరిపాలనకు ఒక్క అవకాశం ఇవ్వండి’
నితీష్ కుమార్ 55 స్కామ్‌లపై ఏం చేశారని ప్రధాని మోదీని ప్రశ్నించిన భారత కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్..
తమకు అధికారం కట్టబెడితే, అవినీతిరహిత పాలన అందిస్తామని ఆర్జేడీ (RJD) నేత, భారత కూటమి(I.N.D.I.A Alliance) ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించి, మందులను అందుబాటు ధరల్లో ఉంచుతామని ప్రకటించారు. పాట్నాలో జరిగిన విలేఖరుల సమావేశంలో శుక్రవారం ఆయన ఈ హామీలిచ్చారు.
ప్రధాని మోదీ(PM Modi)ని లక్ష్యంగా చేసుకుని పలు ఆరోపణలు చేశారు తేజస్వి. "బీజేపీ(BJP) గుజరాత్‌లో కర్మాగారాలను స్థాపించి బీహార్‌లో విజయం సాధించాలని చూస్తోంది. అలా జరగనివ్వం" అని అన్నారు.
'నితీష్‌పై ప్రధాని ఏం చర్య తీసుకున్నారు?'
ఆర్జేడీ పాలనపై గతంలో ప్రధాని మోదీ చేసిన ఆరోపణలకు స్పందిస్తూ.. "నితీష్ కుమార్ ప్రభుత్వం 55 కుంభకోణాలకు పాల్పడిందని స్వయంగా ప్రధానమంత్రే చెప్పారు. మరి ఆయనపై ఏ చర్య తీసుకున్నారు? 'జంగల్ రాజ్' అంటే స్కామ్‌లకు పాల్పడ వారిపై ఏ చర్య తీసుకోకుండా.. నేరస్థులు స్వేచ్ఛగా తిరిగే ప్రదేశం." అని అన్నారు. దేశంలో అత్యధిక నేర కార్యకలాపాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయని ఆరోపించారు.
'నేను అర్ధ సత్యాలు, అబద్ధాలు చెప్పను'
"నేను అర్ధ సత్యాలు, అబద్ధాలు చెప్పను. నేను చేసేదే చెబుతా. చెప్పింది చేస్తా. ఇది మీ అందరికీ తెలుసు. భారత కూటమి ఎన్నికల్లో గెలిస్తే..తేజస్వి ప్రజల ముఖ్యమంత్రి అవుతారు. ఇక నేరాలు జరగకుండా చూస్తాను. బీహార్‌లో అవినీతి రహిత పాలనను అందిస్తాం. " అని చెప్పారు.
ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, కాంట్రాక్టు కార్మికులును రెగ్యులరైజ్ చేస్తామని ఆర్జేడీ నాయకుడు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది.

