
ధనంజయ్ ముండే (ఫైల్)
ఎట్టకేలకు మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా..
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మస్సాజోగ్ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసులో ముండే సహాయకుడు వాల్మీక్ కారాడ్ ప్రధాన నిందితుడు.
మహారాష్ట్ర(Maharashtra) మంత్రి ధనంజయ్ ముండే(Dhananjay Munde) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. పౌర సరఫరాల శాఖకు మంత్రిగా ఉన్న ఈయన..ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ఆదేశాల మేరకు తన రాజీనామాను సమర్పించినట్లు సమాచారం. బీడ్ జిల్లా మస్సాజోగ్ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య మహారాష్ట్రలో సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముండే సహాయకుడు వాల్మీక్ కారాడ్ ప్రధాన నిందితుడని నేర పరిశోధన విభాగం (CID) తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.
పవార్ - ఫడ్నవీస్ భేటీ..
ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar) సోమవారం రాత్రి ఫడ్నవీస్‌ను కలిశారు. దేశ్‌ముఖ్ హత్య కేసులో CID ఛార్జ్‌షీట్ గురించి ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. మంత్రి పదవికి రాజీనామా చేయాలని ధనంజయ్ ముండేను ఫడ్నవీస్ ఆదేశించారని ఒక అధికారి తెలిపారు. బీడ్ జిల్లా పార్లీ నియోజకవర్గ ఎన్సీపీ ఎమ్మెల్యే అయిన ముండే.. గతంలో బీడ్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నారు. ముండే రాజీనామాతో ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీడ్, పుణే జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరించనున్నారు.
దేశ్‌ముఖ్‌ను ఎందుకు హత్యచేశారు?
విండ్‌మిల్ కంపెనీ నుంచి కొంతమంది డబ్బు డిమాండ్ చేశారు. దీన్ని సంతోష్ దేశ్‌ముఖ్ (Santosh Deshmukh) వ్యతిరేకించారు. దీంతో డిసెంబర్ 9న గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దాదాపు మూడు గంటల పాటు దారుణంగా కొట్టి, మృతదేహాన్ని గ్రామ సమీపంలోని రోడ్డుపై పడేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనా స్థలం నుంచి 3.5 అడుగుల గ్యాస్ సిలిండర్ పైపు, కర్రలు, ఇనుప పంచ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నివేదికలో మృతదేహంపై 56 గాయాల ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపిన ఈ ఘటనపై ప్రతిపక్షాలతో పాటు, అధికార పార్టీ నాయకులు సైతం బీడ్ జిల్లా కేంద్రంలో నిరసనలకు దిగారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న మహారాష్ట్ర ఎన్‌సీపీ (NCP) మంత్రి ధనంజయ్(Dhananjay) ముండే సన్నిహితుడు వాల్మిక్ కరాద్ పూణెలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అదే రోజు బీడ్ జిల్లాలోని కేజ్‌లోని కోర్టుకు తీసుకెళ్లి 14 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. ఫిబ్రవరి 27న బీడ్ జిల్లా కోర్టులో CID 1,200 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. బీడ్ జిల్లా కేజ్ పోలీస్ స్టేషన్‌లోఈ హత్యకు సంబంధించి మరో రెండు కేసులు కూడా నమోదు అయ్యాయి. సర్పంచ్ హత్య, సంస్థ సెక్యూరిటీ గార్డుపై దాడి, అవాడా కంపెనీ నుంచి డబ్బు దోచేందుకు యత్నించడంపై విడివిడిగా ఎఫ్ఐఆర్‌లు ఫైల్ అయ్యాయి. ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టుచేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.