
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు: 68 స్థానాలు ఏకగ్రీవం
‘‘పాలకవర్గం బెదిరింపులు, డబ్బు ఆశచూపి అభ్యర్థులను పోటీ నుంచి ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేసింది’’ - శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన
మహారాష్ట్ర(Maharashthra)లో జనవరి 15న మున్సిపల్ ఎన్నికలు (Civic Polls) జరగనున్నాయి. శుక్రవారం నామినేషన్ ప్రతాల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో కొంతమంది తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో మహాయుతి(Mahayuti) కూటమి అభ్యర్థులు 68 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. BJP నుంచి 44 మంది, శివసేన నుంచి 22 మంది, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాజకీయంగా కీలకమైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తో సహా మహారాష్ట్ర అంతటా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. మరుసటి రోజు లెక్కింపు జరగనుంది.
44 మంది ఏకగ్రీవంగా..
BJP నుంచి 44 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అత్యధిక సంఖ్యలో థానే జిల్లాలోని కళ్యాణ్-డోంబివ్లీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, పుణె, పింప్రి చించ్వాడ్, పన్వెల్, భివాండి, ధూలే, జల్గావ్, అహల్యానగర్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. పూణేలోని 35 వార్డ్ నుంచి ప్రత్యర్థులు నామినేషన్ ఫారాలను ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థులు మంజుషా నాగ్‌పురే, శ్రీకాంత్ జగ్‌తాప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిణామంపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు మురళీధర్ మొహోల్ హర్షం వ్యక్తం చేశారు. ఇక పూణే తదుపరి మేయర్ తమ పార్టీ నుండే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మహాయుతి కూటమి నుంచి 68 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, ఇది పార్టీ బలాన్ని ప్రతిబింబిస్తుందని బీజేపీ నాయకుడు కేశవ్ ఉపాధ్యాయ శుక్రవారం అన్నారు.
కాగా పాలకవర్గం బెదిరింపులు, డబ్బు ఆశచూపి అభ్యర్థులను పోటీ నుంచి ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేసిందని ప్రతిపక్షాలు శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఆరోపిస్తున్నాయి.

