మౌనీ అమావాస్య రోజున 10 కోట్ల భక్తుల రాక
x

మౌనీ అమావాస్య రోజున 10 కోట్ల భక్తుల రాక

మహాకుంభమేళాలో పవిత్రస్నానాలకు ప్రత్యేక రోజులు.. జనవరి 29 (మౌనీ అమావాస్య), ఫిబ్రవరి 3 (వసంత పంచమి), 12వ తేదీ (మాఘి పౌర్ణమి), 26వ తేదీ (మహా శివరాత్రి).


మౌనీ అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా జనవరి 29న 'అమృత స్నానం' ఆచరించేందుకు సుమారు 10 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణకు విస్తృత ఏర్పాటు చేస్తోంది.

మహా కుంభ మేళా సందర్భంగా నదీ సంగమంలో పవిత్ర స్నానాలు చేయడం ఆనవాయితీ. అయితే కొన్ని ప్రత్యేక దినాల్లో పవిత్ర స్నానాలు (Holy dip) చేయడానికి కొంతమంది భక్తులు ఇష్టపడతారు. ఈ క్రమంలో జనవరి 29న మౌనీ అమావాస్య సందర్భంగా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. జనవరి 13 (పౌష పౌర్ణమి), 14 (మకర సంక్రాంతి)న కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. ఇలాంటి శుభదినాలు ఫిబ్రవరిలో మరో మూడున్నాయి. 3వ తేదీన (వసంత పంచమి) , 12న (మాఘి పౌర్ణమి), ఫిబ్రవరి 26న (మహా శివరాత్రి).

భక్తుల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు..

మౌనీ అమావాస్యకు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులు తమకు కేటాయించిన ప్రాంతం లేదా జోన్ నుంచి ప్రవేశించి, అదే ప్రాంతం ద్వారా తిరిగి వెళ్లేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌లు, అదనపు పోలీస్ సూపరింటెండెంట్‌లు, సర్కిల్ ఆఫీసర్‌లు, ఉపవిభాగ మేజిస్ట్రేట్‌లు, జోన్ మేజిస్ట్రేట్‌లు తమ పరిధుల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పర్యవేక్షించాలని సూచించింది.

12 కిలో మీటర్ల భారీ ఘాట్..

జనవరి 27 నుంచి 29వ తేదీ వరకు జోన్‌ల మధ్య ప్రయాణాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికార యంత్రాగం తెలిపింది. ఎక్కువ మంది పవిత్ర స్నానం ఆచరించడానికి వీలుగా 12 కిలోమీటర్ల పొడవైన ఘాట్‌ను నిర్మించారు. భక్తులు తమ ప్రవేశ ప్రాంతానికి సమీపంలోని ఘాట్‌లోనే స్నానం చేసి, ఇతర జోన్‌లకు ప్రయాణించకుండా వెంటనే తిరిగి వెళ్లాలని ప్రోత్సహిస్తోంది. భక్తుల రద్దీని నియంత్రించడానికి తగినంత బృందాలను రంగంలోకి దింపనున్నారు.

144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు భక్తులు పోటెతుతున్నారు. యూపీ ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమునా, సరస్వతి నదీ సంగమం ఒడ్డున భక్తులు పవిత్ర స్నానాలు అచరిస్తున్నారు. జనవరి 13న ప్రారంభమై ఈ మేళా ఫిబ్రవరి 26తో ముగుస్తుంది.

Read More
Next Story