చంద్రబాబు బాటలోనే కేటీయార్ నడుస్తున్నారా  ?
x

చంద్రబాబు బాటలోనే కేటీయార్ నడుస్తున్నారా ?

పాజిటివ్ పబ్లిసిటీ చేయించుకున్న తర్వాత కూడా చేసిన మేలు చెప్పుకోలేక ఓడిపోయామని చెప్పటం కేటీయార్ కే చెల్లింది.


తాజాగా మాజీమంత్రి కేటీయార్ ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అదేమిటంటే తమ పదేళ్ళ పాలనలో చేసినవి చెప్పుకోలేకే ఓడిపోయారట. అంతేకాకుండా కాంగ్రెస్ దొంగహామీలిచ్చి జనాలను మోసంచేసి ఓట్లేయించుకున్నదట. జనాలను మోసంచేసింది కాబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కేటీయార్ మాటలు విన్నతర్వాత ఇంకెవరో ఇలాంటి ఆరోపణలనే చేస్తున్నట్లు అనిపించింది. ఎవరాని ఆలోచిస్తే ఫార్టీ ఇయర్స్ చంద్రబాబునాయుడు గుర్తుకొచ్చారు. చంద్రబాబు కూడా అంతే వైసీపీ అధికారంలోకివచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయిన దగ్గర నుండి చంద్రబాబు ఒకటే గోలచేస్తున్నారు. ఏమిటంటే జనాలను జగన్ మోసంచేసి ఓట్లేయించుకున్నాడని. తమను ఓడగొట్టి వైసీపీని అందలమెక్కించిన పాపానికి జనాలు తగిన ఫలితాన్ని అనుభవిస్తారని ఎన్నిసార్లు శాపనార్ధాలు పెట్టారో లేక్కేలేదు.


జనాలను మోసంచేసి జగన్ ఓట్లేయించుకోవటం ఏమిటో, ఒకళ్ళు మోసంచేస్తే మోసపోయి ఓట్లేసేంత అమాయకులా జనాలు ? చంద్రబాబు వ్యవహారం మొత్తం ఆత్మస్తుతి పరనింద పద్దతిలోనే ఉంటుంది. తానుచేసిన తప్పులను ఎప్పటికి ఒప్పుకోరు. ఇపుడు కేటీయార్ కూడా అచ్చం అలాగే మాట్లాడారు. నల్గొండ జిలా పర్యటనలో కేటీయార్ మాట్లాడుతు తమ పదేళ్ళ పాలనలో చేసిన మంచిని జనాలకు చెప్పుకోలేక బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. అలాగే కాంగ్రెస్ జనాలను మోసంచేసి, దొంగహామీలిచ్చి ఓట్లేయించుకున్నదట. జనాలను మోసంచేసింది కాబట్టే హస్తంపార్టీ అధికారంలోకి వచ్చిందని కేటీయార్ చెప్పటమే విచిత్రంగా ఉంది. పదేళ్ళ కేసీయార్ పాలనపై మీడియాలో ఎక్కడా వ్యతిరేక వార్తలు, కథనాలు రాకుండా మ్యానేజ్ చేసుకున్నారనే ఆరోపణలకు కొదవేలేదు.


కేసీయార్ పాలన బ్రహ్మాండమని అదని ఇదని పాజిటివ్ గా రాయించుకున్నారు. ఇంత పాజిటివ్ పబ్లిసిటీ చేయించుకున్న తర్వాత కూడా చేసిన మేలు చెప్పుకోలేక ఓడిపోయామని చెప్పటం కేటీయార్ కే చెల్లింది. మీడియాను గుప్పిట్లో పెట్టుకుని తన పాలనపై నెగిటివ్ వార్తలు, కథనాలు రాకుండా కేసీయార్ చూసుకోవటంవల్ల జనాల్లో ఉన్న వ్యతిరేకత కనబడలేదు. జనాల్లో వ్యతిరేకత ఉందని తెలిసినా కేసీయార్ పట్టించుకోలేదు. పాజిటివ్ వార్తలు, కథనాలు, డబ్బు, అధికారమే తమను మూడోసారి అధికారంలోకి తెస్తుందని కేసీయార్ భ్రమల్లో ముణిగిపోయారు. ఆ అతివిశ్వాసమే చివరకు కొంపముంచేసింది.


2019లో చంద్రబాబు, 2023లో కేసీయార్ ఓటమికి ముఖ్యకారణం జనాల్లో విపరీతంగా పెరిగిపోయిన వ్యతిరేకతే. తమ పాలనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయిన కారణంగానే తాము ఓడిపోయామని ఇద్దరు అంగీకరించటానికి ఇష్టపడటంలేదు. అందుకనే ఏపీలో జగన్, తెలంగాణాలో కాంగ్రెస్ జనాలను మోసంచేసి, దొంగహామీలిచ్చి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చారని గోలగోలచేస్తున్నారు. కేటీయార్ మాటలు విన్నతర్వాత అచ్చంగా చంద్రబాబు అడుగుజాడల్లోనే నడుస్తున్నట్లు అర్ధమవుతోంది. తమపాలనలో జరిగిన తప్పులను నిజాయితీగా విశ్లేషించుకుంటే లోపాలు ఎక్కడున్నాయో తెలుస్తుంది. ఒకవేళ తమ లోపాలు తెలిసి కూడా ఒప్పుకోవటానికి ఇష్టపడక ప్రత్యర్ధులపైనే ఆరోపణలు చేస్తు, శాపనార్ధాలు పెడుతుంటే ఎవరు ఏమీచేయలేరంతే.


Read More
Next Story