కోల్‌కతా IIM కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం..
x

కోల్‌కతా IIM కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం..

బాయ్స్ హాస్టల్‌లో ఘటన.. మత్తులోకి జారుకున్నాక అఘాయిత్యం..


కోల్‌కతా(Kolkata)లో మరో ఘోరం జరిగింది. ఓ ప్రముఖ విద్యా సంస్థలో అత్యాచార (Rape) ఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి (జూలై 11) విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లో సెకండీయర్ చదువుతోన్న పర్మానంద్ జైన్ .. అదే కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కౌన్సెలింగ్ సెషన్‌ కోసమని బాధితురాలిని బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు పిజ్జా, కూల్‌డ్రింక్ ఆఫర్ చేశాడు. వాటిని తీసుకున్న కాసేపటికి స్పృహ కోల్పోయింది. స్పృహలో లేని సమయంలో తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు హరిదేవ్ పూర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం బయట పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిందితుడు తనను బెదిరించినట్లు ఫిర్యాదులో రాసి ఉంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

రిజిస్టర్‌లో సంతకం చేయకుండా బాయ్ హాస్టల్‌లోకి బాధితురాలు ఎలా ప్రవేశించింది? సెక్యూరిటీ గార్డులు ఏం చేస్తున్నారు? నిందితుడికి పొలిటికల్ ఇన్‌ప్లూయెన్స్ ఏమైనా ఉందా? అనే కోణంలో విచారిస్తున్నారు. సెక్యూరిటీ గార్డులను కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు.

సీఎం మమతపై బీజేపీ దాడి..

ఈ అత్యాచార ఘటనపై అధికార టీఎంసీపై బీజేపీ విమర్శలు గుప్పించింది. సీఎం మమత బెనర్జీ "రేపిస్టులను రక్షిస్తున్నారని" ఆరోపిస్తూ ఎక్స్‌లో పోస్టు చేసింది.

గ్యాంగ్ రేప్ మరువక ముందే..

సౌత్ కోల్‌కతా లా కాలేజీలో విద్యార్థినిపై ఇటీవల గ్యాంగ్ రేప్ జరిగింది. ఒక పూర్వ విద్యార్థి, మరో ఇద్దరు సీనియర్లు ఈ ఏడాది జూన్ 25న సామూహిక అత్యాచారానికి (Gang rape) పాల్పడ్డారు. కేసులో ప్రధాన నిందితుడు మోనోజిత్‌ మిశ్రా(31)తో పాటు ఇద్దరు సీనియర్ విద్యార్థులు జాయిబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) దర్యాప్తు చేస్తోంది.

గతేడాది ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో ..

కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో 2024 ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్‌ను అత్యాచారం చేసి హత్య చేశారు. సీబీఐ దర్యాప్తు చేసిన ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కి కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.

Read More
Next Story