
‘సొంత నిర్ణయాలొద్దు..పార్టీ నిర్ణయించేదాకా సంయమనం పాటించాలి’
కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సన్నాహక సమావేశానికి హాజరయిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ..
కేరళ(Kerala)లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Polls) జరగనున్న నేపథ్యంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ (KC Venu Gopal) ఆదివారం (జనవరి 4) వయనాడ్‌లోని సుల్తాన్ బతేరిలో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. బహిరంగంగా ఎవరూ కూడా సొంత అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకోకూడదని కోరారు. పార్టీ నిర్ణయం మేరకు నడుచుకోవాలని సూచించారు. అవసరమైతే పార్టీ నాయకత్వంతో నేరుగా మాట్లాడే అవకాశం ఉందని చెప్పారు.
బీజేపీతో ఎల్‌డీఎఫ్ రహస్య పొత్తు ?
కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)కు రాష్ట్రంలో అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్), భారతీయ జనతా పార్టీ(BJP) ఉమ్మడి ప్రత్యర్థులని వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇటీవ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటామని, ఇదే జోష్ అసెంబ్లీ ఎన్నికల్లో కనపర్చాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత.. మూడోసారి అధికారంలోకి వస్తామన్న విశ్వాసం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సన్నగిల్లిందని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో ఆయన రహస్య పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోపించారు.
ఎన్నికల నోటిఫికేషన్‌కు చాలా రోజుల ముందుగానే అభ్యర్థుల పేర్లను ప్రకటించి.. ప్రచారానికి పంపాలన్న ఆలోచనలో ఉందని వేణుగోపాల్ చెప్పారు. యూడీఎఫ్ కేరళలో చివరిసారిగా 2011లో అధికారంలో ఉంది. ఆ తర్వాత 2016, 2021లో ఎన్నికలలో ఓటమి పాలైంది.

