
ముగిసిన కాశీ తమిళ సంగమం 3.0
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో నిర్వహించిన కాశీ తమిళ సంగమం 3.0 ముగిసింది.
తమిళనాడు(Tamilnadu) , ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రాల మధ్య సాంస్కృతిక వారధిగా ఈ కార్యక్రమం గత మూడేళ్ల నుంచి కొనసాగుతోంది. ఈనెల 15 నుంచి 24 వరకు 10 రోజుల పాటు వారణాసిలో విద్యా మంత్రిత్వ శాఖ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సహకారంలో నిర్వహించిన ఈ సంగమంలో కళాకారులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, రైతులు, స్వయం సహాయ సంఘాల సభ్యులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయిన వారు అయోధ్య, ప్రయాగ్రాజ్ లాంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించారు.
గంగా నదీ తీరంలోని నామో ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన తమిళనాడుకు సంబంధించిన ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తమిళ నాటక ప్రదర్శనలు, సంప్రదాయ నృత్యాలు, తమిళ వైద్య విధానాలు ఆకర్షణలుగా నిలిచాయి. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అకడమిక్ సెషన్లు తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింతగా బలోపేతం చేశాయి.
కేరళ సందర్శకుల అనుభవం..
కోయంబత్తూరు నుంచి వచ్చిన కుమారేశన్ తన అనుభవాన్ని వివరిస్తూ.. "కాశీలో మాకు అద్భుత స్వాగతం లభించింది. తమిళ సాంస్కృతిక సంపదకు ఇక్కడ ఎంతో గౌరవం ఉంది. సర్కారు కూడా మాకు సౌకర్యాలను సమకూర్చించి. త్రిస్టార్ హోటల్ 'హోటల్ డి పారిస్' లో బసచేశాం. భోజనం కూడా రుచికరంగా ఉంది. అధికారులంతా మమ్మల్ని 'మోదీ గౌరవ అతిథులు'గా వ్యవహరించడం గౌరవంగా అనిపించింది" అని కుమారేశన్ అభిప్రాయపడ్డారు.
కళాకారులకు కొత్త అవకాశాలు..
తమ కళను ప్రదర్శించేందుకు కళాకారులకు అవకాశం కల్పించారు. తంజావూరు నుంచి వచ్చిన నాటక బృందం "కాంబ రామాయణం" నాటకం ప్రదర్శించింది. ప్రయాణ, వసతి ఖర్చులను ప్రభుత్వం భరించింది. మా కళను ప్రదర్శించేందుకు అద్భుత అవకాశం కల్పించారు, " అని బృందసభ్యుడొకరు పేర్కొ్న్నారు.
అయితే షెడ్యూల్‌లో కొన్ని మార్పుల వల్ల అసౌకర్యం కలిగిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు పేర్కొన్నారు. "అంతా బాగుంది. కానీ షెడ్యూల్ చివరకు మారడం వల్ల కొంత గందరగోళం ఏర్పడింది. అయినా కాశీ, అయోధ్య, మహాకుంభ్ సందర్శించడం ఒక దైవానుగ్రహంగా భావిస్తున్నాం. ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు," అని మదురై నుంచి వచ్చిన సందర్శకుడు అన్నారు.
పుస్తక విక్రయాల్లో తగ్గుదల..
సాంస్కృతిక, విద్యా కార్యక్రమాలు విజయవంతమైనప్పటికీ.. గత రెండు సంవత్సరాలతో పోల్చినప్పుడు ఈ ఏడాది పుస్తక విక్రయాల్లో తగ్గుదల కనిపించింది. "ఈసారి మహాకుంభ్ ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించింది. ఈసారి కేవలం 10 రోజులు మాత్రమే ఈ కార్యక్రమం జరగడంతో పుస్తక ప్రదర్శన వద్ద రద్దీ తగ్గింది," అని ఒక అధికారిక ప్రతినిధి తెలిపారు. మొదటి ఎడిషన్‌లో రూ.3 లక్షలకు పైగా పుస్తకాలు అమ్ముడయినప్పటికీ, ఈ ఏడాది అమ్మకాలు వేల రూపాయలకే పరిమితమయ్యాయి.
కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం యోగి..
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 14న ప్రారంభించారు. దేశీయ, అంతర్జాతీయ నేతలు హాజరయ్యారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నాగాలాండ్ గవర్నర్ గణేశన్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
కార్యక్రమం ముగింపు వేడుకకు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మజి, కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ హాజరయ్యారు. కాశీ, తమిళనాడు మధ్య సాంస్కృతిక సంబంధాలను ఒక వేదికపైకి తెచ్చిన నిర్వాహకులకు మజి అభినందనలు తెలిపారు.