
సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం
జస్టిస్ బీఆర్ గవాయ్ స్థానంలో నియామకం..శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..
భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ కాసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని మోదీ(PM Modi), మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, బీజేపీ సీనియర్ నేతలు హాజరయ్యారు. జస్టిస్ బీఆర్ గవాయ్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన సూర్యకాంత్ సుమారు 15 నెలల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు.
సీజేఐకి ప్రధాని శుభాకాంక్షలు..
ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జస్టిస్ సూర్యకాంత్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రమాణ స్వీకారోత్సవ దృశ్యాలను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్ చేశారు మోదీ.
Attended the oath taking ceremony of Justice Surya Kant as the Chief Justice of India. Best wishes to him for his tenure ahead. pic.twitter.com/62yeSlfmsx
— Narendra Modi (@narendramodi) November 24, 2025
రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, మాజీ ప్రధాన న్యాయమూర్తి గవాయ్, న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌తో కలిసి ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గ్రూప్ ఫోటో దిగారు.
జస్టిస్ సూర్యకాంత్ గురించి క్లుప్తంగా..
జస్టిస్ కాంత్ ఫిబ్రవరి 10, 1962న హర్యానాలోని హిసార్ జిల్లాలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులది మధ్యతరగతి కుటుంబం. 2011లో కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని 'ఫస్ట్ క్లాస్'లో పూర్తి చేశారు. గతంలో పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. అక్టోబర్ 5, 2018న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను పరిష్కరించడంలో గవర్నర్, రాష్ట్రపతి అధికారాలపై ఇటీవల జరిగిన రాష్ట్రపతి సూచనలో ఆయన కూడా ఉన్నారని గమనించాలి. బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) చేపట్టాలన్న పోల్ ప్యానెల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు విచారించారు. ఈ సందర్భంగా బీహార్‌లోని ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి మినహాయించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను బహిర్గతం చేయాలని జస్టిస్ కాంత్ ఈసీని కోరిన విషయం తెలిసిందే.
సంస్కరణలలో కీలక పాత్ర..
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సహా బార్ అసోసియేషన్లలో మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ చేయాలని ఆదేశించిన ఘనత జస్టిస్ సూర్యకాంత్‌కే దక్కుతుంది. రక్షణ దళాలకు వన్ ర్యాంక్-వన్ పెన్షన్ పథకాన్ని కూడా సమర్థించారు. 2022లో ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా ఉల్లంఘనపై దర్యాప్తు చేయడానికి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీని నియమించిన ధర్మాసనంలో జస్టిస్ కాంత్ ఒకరు.

