దీక్ష విరమించిన కోల్‌కతా ఆర్జీ కర్ జూనియర్ డాక్టర్లు..
x

దీక్ష విరమించిన కోల్‌కతా ఆర్జీ కర్ జూనియర్ డాక్టర్లు..

ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం ముగిశాక సోమవారం సాయంత్రం జూనియర్ వైద్యులు దీక్ష విరమించారు.


పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్షను విరమించారు. ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలిని ఆత్యాచారం తర్వాత హత్య చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయడంతోపాటు తమకూ రక్షణ కల్పించాలని అక్టోబర్ 5న జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం ముగిశాక సోమవారం సాయంత్రం జూనియర్ వైద్యులు దీక్ష విరమించారు.

“ఈరోజు సీఎంతో సమావేశమయ్యాం. మా డిమాండ్లలో కొన్నింటికి హామీ లభించింది. మా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ ప్రజలు, బాధితురాలి తల్లిదండ్రుల సూచనమేరకు నిరాహారదీక్షను విరమిస్తున్నాం.”అని జూనియర్ వైద్యులలో ఒకరైన దేబాశిష్ హల్దర్ తెలిపారు. సీఎంతో సమావేశం సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బందికి భద్రత కల్పిస్తామని సమావేశంలో సీఎం ప్రకటించారు. అలాగే ప్రభుత్వం నుంచి ఐదుగురు ప్రతినిధులు, జూనియర్‌ వైద్యులతో పాటు రాష్ట్ర స్థాయిలో 10 మంది సభ్యులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. టాస్క్‌ఫోర్స్‌లో జూనియర్‌ వైద్యులకు కనీసం ఒక మహిళ ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించారు. వైద్య పరీక్షల్లో పారదర్శకతపై కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. “ఎవరూ ఎలాంటి మోసాలకు పాల్పడకుండా ప్రభుత్వం చూసుకోవాలి. చాలా మంది విద్యార్థులు రెండేళ్లుగా ఇలా చేసినట్లు మాకు సమాచారం ఉంది. నేను దానిని బహిర్గతం చేయదలచుకోలేదు." అన్నారు.

కొంతమంది జూనియర్‌ డాక్టర్లను నిబంధనలు పాటించకుండా సస్పెండ్ చేయడం గురించి కూడా చర్చకు వచ్చింది. ఫిర్యాదుల ఆధారంగా విద్యార్థులను లేదా రెసిడెంట్ వైద్యులను ఎలా సస్పెండ్ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ఇలా నిర్ణయాలు తీసుకునే హక్కు కళాశాల అధికారులకు ఎవరు ఇచ్చారు? అని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More
Next Story