
జర్నలిస్ట్ స్నేహ బార్వేపై దాడి.. ఇంకా అరెస్టుకాని ప్రధాన నిందితుడు
నదీతీరంలో అక్రమ నిర్మాణం గురించి వివరిస్తుండగా ఘటన..కెమెరామెన్‌పై కూడా.. దాడిని అడ్డుకోబోయిన వారికి గాయాలు..
పూణే(Pune)కు చెందిన మహిళా జర్నలిస్టు (Journalist) స్నేహ బార్వే(Sneha Barve)పై కొంతమంది దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. మహారాష్ట్రలోని పూణే జిల్లా మంచార్ పట్టణానికి సమీపంలోని నిగోత్వాడి గ్రామంలో ఈ దారుణం జరిగింది. నదీతీరంలో జరుగుతోన్న అక్రమ నిర్మాణ గురించి వివరిస్తుండగా కర్రలతో దాడిచేశారు. మోర్డే అనే వ్యక్తి పదే పదే కొట్టడంతో ఆమె సృహ కోల్పోయింది. కెమెరామెన్ అజాజ్ షేక్‌పై కూడా దాడికి పాల్పడ్డారు. దాడిని అడ్డుకోబోయిన స్థానికులపై కూడా మోర్డే అనుచరులు దాడి చేశారు. ఒకరి చేయి విరగ్గా.. మరొకరి ముక్కుపై గాయమైంది. స్థానికులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి, తర్వాత పింప్రి-చించ్‌వాడ్‌లోని డివై పాటిల్ ఆసుపత్రికి తరలించారు. స్నేహ ఆసుపత్రిలో ఉండడంతో పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయలేకపోయింది. అయితే దాడిలో గాయపడిన కూరగాయల వ్యాపారి సుధాకర్ బాబూరావు కాలే ఫిర్యాదు చేశారు.
దాడిని ఖండించిన NWMI..
సమర్థ్ భారత్ వార్తాపత్రిక, SBP యూట్యూబర్ అయిన స్నేహ బార్వేపై దాడిని నెట్‌వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా ఇండియా (NWMI) ఖండించింది. దాడికి పాల్పడ్డ పాండురంగ మోర్డేను, ఆయన అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పటివరకు మహారాష్ట్ర ప్రభుత్వం దాడిని ఖండించకపోవడం దారుణమని పేర్కొంది.
మోర్డే నేర చరితుడే..
నేర చరిత్ర ఉన్న మోర్డే ఇప్పటికే హత్యాయత్నం కేసులో బెయిల్‌పై బయటకు వచ్చాడు. మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమితో సన్నిహిత సంబంధాలున్నాయని సమాచారం.
బలహీనమైన సెక్షన్లు..
నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని 118 (2), 115 (2), 189 (2), 191 (2), 190, 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బలహీనమైన సెక్షన్ల కింద కేసు కట్టడంతో నిందితులు వెంటనే బెయిల్‌పై బయటకు వచ్చారని NWMI పోలీసులను తప్పబట్టింది. ఈ కేసులో మోర్డేను ఇంకా అరెస్టు చేయలేదు.
ఎస్పీ ఏమంటున్నారు?
బార్వేపై దాడికి పాల్పడ్డ మోర్డే కొడుకులు ప్రశాంత్, నీలేష్ మోర్డే సహా మరో నలుగురికి అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ సందీప్ సింగ్ గిల్ చెప్పారు. ఎముక విరగడంతో ఆసుపత్రిలో చేరిన మోర్డేను, డిశ్చార్చ్ కాగానే అరెస్టు చేస్తామని ఎస్పీ చెప్పారు. నిందితులకు వెంటనే బెయిల్ రావడంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘ఘటన జరిగిన తర్వాత బార్వే ఆసుపత్రిలో అచేతనంగా ఉన్నారు. దాంతో గాయపడిన వ్యక్తి నుంచి కంప్లైట్ తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఇప్పుడు మరో FIR నమోదు చేయాలని బార్వే కోరుకుంది. ఒకే ఘటనకు సంబంధించి రెండు FIRలు నమోదు చేయలేం. ఆమె చెప్పిన వివరాలను రాసుకుని అవసరమైతే సెక్షన్లు మారుస్తాం. నేను ఈ కేసును వ్యక్తిగతంగా పరిశీలిస్తాను, ”అని గిల్ హామీ ఇచ్చారు.