
ఇండోర్‌లో తాగునీరు కలుషితం .. మున్సిపల్ కమిషనర్ బదిలీ..
ఇంకా ఐసీయూలో 34 మంది.. వివిధ ఆస్పత్రుల్లో 203 మంది..
మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రం ఇండోర్(Indore)లో తాగునీరు కలుషితం కావడం వల్ల వందల సంఖ్యలో జనం అనారోగ్యం బారినపడ్డ విషయం తెలిసిందే. వాంతులు, విరేచనాలతో పలు ఆసుపత్రల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి దాకా 203 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారిక సమాచారం. వీరిలో 34 మంది ఐసీయూలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందినట్లు అధికారికంగా ధృవీకరించారు. అయితే మరణాల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఇందోర్ మున్సిపల్ కమిషనర్‌ను బదిలీ చేసింది. ఇద్దరు సీనియర్ అధికారులను సస్పెండ్ చేసింది. తాగునీటి సరఫరా వ్యవస్థలో లోపాలే ఈ సంక్షోభానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పరిస్థితి నియంత్రణలో ఉందని, కాలుష్యానికి కారణమైన అంశాలపై విచారణ కొనసాగుతోందని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
మృతులకు పరిహారం..
కలుషిత తాగునీటి ఘటనకు తమ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని ముఖ్యమంత్రి మోహన్ సింగ్(C.M. Mohan Yadav) ఇప్పటికే ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం అందిస్తామని, ఆసుపత్రి చికిత్స ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. నీటి సరఫరా వ్యవస్థపై సమగ్ర తనిఖీ చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇందోర్ లాంటి ‘క్లీన్ సిటీ’గా పేరున్న నగరంలో తాగునీటి కలుషితం జరగడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. పట్టణ మౌలిక వసతుల నిర్వహణ, పౌరుల ఆరోగ్య భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

