పార్లమెంట్‌లో NEET‌పై చర్చకు ఇండియా కూటమి పట్టు?
x

పార్లమెంట్‌లో NEET‌పై చర్చకు ఇండియా కూటమి పట్టు?

పార్లమెంట్ సమావేశాల తొలిరోజే ఇండియా కూటమి నేతలు దూకుడు ప్రదర్శిస్తారా? అంటే అవుననే చెప్పాలి. నీట్‌పై చర్చకు లోక్‌సభ, రాజ్యసభలో కూటమి ఎంపీలు నోటీసు ఇవ్వనున్నారా?


పార్లమెంట్ ఉభయ సభల్లో NEET అంశాన్నిలేవనెత్తాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. గురువారం ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నీట్‌పై చర్చకు అటు లోక్‌సభ ఇటు రాజ్యసభలో కూటమి ఎంపీలు నోటీసులు దాఖలు చేయనున్నారు.

ధన్యవాదాల తీర్మానం..

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. జులై 2లోగా ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై సమాధానం ఇవ్వవచ్చు. ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని బిజెపి ఎంపి బన్సూరి స్వరాజ్ రెండో స్థానంలో ఉంచినట్లు సమాచారం. ఇటు రాజ్యసభలో బిజెపికి చెందిన సుధాన్షు త్రివేది శుక్రవారం ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దీనికి ఎగువ సభలో జూలై 3న ప్రధాని సమాధానం ఇవ్వవచ్చు.

జూలై 1న నిరసన..

జూలై 1న పార్లమెంట్ కార్యకలాపాలు ప్రారంభం కావడానికి ముందు నిరసన చేపట్టాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, విపక్ష నేతలపై రాజకీయ కక్ష సాధింపుల ధోరణి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో గురువారం జరిగిన కూటమి నేతల సమావేశానికి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, శరద్ పవార్, సుప్రియా సూలే (ఇద్దరూ ఎన్సీపీ-ఎస్పీ నుంచి), డెరెక్ ఓబ్రెయిన్ (టీఎంసీ) హాజరయ్యారు. సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది (శివసేన-UBT), సంజయ్ సింగ్, సందీప్ పాఠక్ (ఇద్దరూ AAP), NK ప్రేమచంద్రన్ (RSP) మహువా మాఝీ (JMM) హాజరైన వారిలో ఉన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం తన ప్రసంగంలో పేపర్ లీక్‌ల ఘటనలపై మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇవ్వవచ్చని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. పార్లమెంటు సమావేశాలు జూలై 3తో ముగిసే అవకాశం ఉంది.

Read More
Next Story