
బడ్జెట్ సమావేశాల్లో ఇండియా బ్లాక్ నేతల వ్యూహం ఏమిటి?
ఇండియా బ్లాక్ కీలక సమావేశంలో చర్చించిన అంశాలేంటి?
రాబోయే పార్లమెంట్(Parliament) బడ్జెట్ సమావేశాలు కేంద్రాన్ని ప్రతిపక్షాలు ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నాయా? ఇండియా నేతలు అందుకు సమాయత్తమవుతున్నాయా? అవుననే చెప్పాలి. MGNREGA రద్దు, ఓటర్ల జాబితా సవరణ (SIR) అంశాలను సమావేశాల్లో ప్రస్తావనకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఇండియా(I.N.D.I.A) బ్లాక్ నాయకులు నిర్ణయించారు. ఈ మేరకు జనవరి 28న ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే(Kharge) ఛాంబర్‌లో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi), ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ హాజరుకానున్నారు. అలాగే డీఎంకే నుంచి టీఆర్ బాలు, శివసేన (యూబీటీ) నుంచి అరవింద్ సావంత్, సమాజ్‌వాదీ పార్టీ నుంచి జావేద్ అలీఖాన్, ఆర్‌జేడీ నుంచి ప్రేమ్‌చంద్ గుప్తా, సీపీఐ(ఎం) నుంచి జాన్ బ్రిట్టాస్ సహా ఇండియా బ్లాక్‌కు చెందిన పలువురు ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
ప్రతిపక్షాల వ్యూహం ఇదే..
బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఈ అంశాలపై చర్చకు నిరాకరిస్తున్న నేపథ్యంలో.. MGNREGA పథకం రద్దు వల్ల గ్రామీణ ప్రజలపై పడే ప్రభావం, ఓటర్ల జాబితా సవరణలో జరుగుతున్న అక్రమాలు అంశాలను పార్లమెంటులో గట్టిగా లేవనెత్తాలని ప్రతిపక్ష నాయకులు నిర్ణయించినట్లు వర్గాలు వెల్లడించాయి. ఈ అంశాలపై సభలో చర్చ జరిపే వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని వారు భావిస్తున్నారు.
సోనియా నివాసంలో చర్చ..
ఇదే అంశాలపై కాంగ్రెస్ అగ్ర నాయకులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నివాసంలో జరిగిన పార్టీ వ్యూహ సమావేశంలో బడ్జెట్ సమావేశాల్లో MGNREGA, SIR అంశాలను ప్రధానంగా లేవనెత్తాలని తీర్మానించారు. ఆ సమావేశంలో లోక్‌సభ, రాజ్యసభల ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే కూడా పాల్గొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే బడ్జెట్ సమావేశాలు తీవ్ర రాజకీయ దుమారం మధ్య సాగనున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

