
BMC మహాయుతి కూటమి మ్యానిఫెస్టో విడుదల
పౌర మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం..
బ్రిహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల నేపథ్యంలో అధికార మహాయుతి కూటమి (బీజేపీ–శివసేన–ఆర్పీఐ) తమ పోల్ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ముంబై ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన వరదలు, రోడ్లపై గుంతలు, ట్రాఫిక్, గృహ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తామని మహాయుతి నేతలు హామీ ఇచ్చారు. మహారాష్ట్ర(Maharashtra) ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis), ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) ఆదివారం ఓ బహిరంగ సభలో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. మ్యానిఫెస్టోలో పౌర మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. వర్షాకాలంలో ముంబైని ముంచెత్తుతున్న వరదలకు చెక్ పెట్టేందుకు డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరిస్తామని ప్రకటించారు. రోడ్లమీద గుంతలు లేని విధంగా అభివృద్ధి చేసి, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానాలను అమలు చేస్తామని తెలిపారు. నగరానికి తాగునీటి కొరత లేకుండా చేయడానికి గర్గాయి, పింజల్, దమణ్‌గంగ వంటి కీలక నీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. అలాగే ఐదు సంవత్సరాల పాటు నీటి పన్ను పెంపును నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. మహిళల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిన మహాయుతి, BEST బస్ సేవల్లో మహిళలకు 50 శాతం టికెట్ రాయితీ అందిస్తామని ప్రకటించారు. ముంబైను ‘స్లమ్-ఫ్రీ సిటీ’గా మార్చే దిశగా భారీ స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించింది. ఆగిపోయిన పునర్వికాస ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించి, స్లమ్ రీడెవలప్‌మెంట్ స్కీమ్‌లను వేగవంతం చేస్తామని తెలిపింది. పాలనలో పారదర్శకత తీసుకురావడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత గవర్నెన్స్‌ను ప్రవేశపెడతామని మహాయుతి ప్రకటించారు. అక్రమ వలసదారుల నుంచి ముంబై వాసులకు విముక్తి కల్పిస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఐఐటీలతో కలిసి AI ఆధారిత సాంకేతికను అభివృద్ధి చేస్తోందన్నారు. మొత్తంగా ఈ మ్యానిఫెస్టో ద్వారా ముంబైను సురక్షితమైన, సౌకర్యవంతమైన, ఆధునిక మహానగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మహాయుతి కూటమి ప్రకటించింది.

