![‘‘అక్రమ వలసదారులకు సంకెళ్లు వేయడం కొత్త కాదు ‘‘అక్రమ వలసదారులకు సంకెళ్లు వేయడం కొత్త కాదు](https://andhrapradesh.thefederal.com/h-upload/2025/02/06/510927-jaishankar.webp)
‘‘అక్రమ వలసదారులకు సంకెళ్లు వేయడం కొత్త కాదు"
అమెరికా అక్రమ వలసదారులకు బేడీలు వేసి భారతదేశానికి తీసుకురావడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. పార్లమెంట్‌లోనూ పెను దుమారం రేగింది.
అగ్రరాజ్యం(America)లో అక్రమంగా ఉంటున్న 104 మంది భారతీయులను బుధవారం ఇండియాకు తీసుకొచ్చారు. అయితే టెక్సాస్‌లో విమానం ఎక్కించే ముందు వారి చేతులకు బేడీలు, కాళ్లను గొలుసుతో కట్టి తీసుకొచ్చారు. అమృత్ సర్ విమానాశ్రయంలోకి ల్యాండ్ అవ్వగానే వాటిని తొలగించి వదిలేశారు. భారతీయుల పట్ల అమెరికన్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బేడీలు వేయడం చాలా దేశాల్లో ఉంది..
గురువారం (ఫిబ్రవరి 6) రాజ్యసభలోనూ దీనిపై చర్చ జరిగింది. అక్రమ వలసదారులపై అమెరికా అధికారులు అనుచితంగా ప్రవర్తించారని ప్రతిపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. దీంతో విదేశాంగ మంత్రి (External Affairs Minister) ఎస్. జైశంకర్ వివరణ ఇచ్చారు. "ఒక దేశ పౌరులు విదేశాల్లో అక్రమంగా ఉంటే, వారి స్వదేశానికి తిరిగి పంపించాల్సిన బాధ్యత అన్ని దేశాలకూ ఉంది" అని ఆయన పేర్కొ్న్నారు. అక్రమ వలసదారులకు (Illegal Indian immigrants) ఇలాంటి పరిస్థితులు కొత్తేమీ కాదని చెప్పారు. అక్రమ వలసదారులకు బేడీలు వేయడం చాలా దేశాల్లో ఉంది. ఈ ఘటన మొదటిదేం కాదన్నారు. ఒక దేశం తన పౌరులను తిరిగి స్వీకరించాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేస్తూ.. వారి సంక్షేమం గురించి కూడా ఆలోచిస్తుందని జైశంకర్ (Jaishankar) హామీ ఇచ్చారు.
సంప్రదింపుల అవసరం..
అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అమెరికాతో చర్చించాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఈ ఘటనపై భారత్ ఆగ్రహంగానే ఉన్నా.. అక్రమ వలసదారుల విషయంలో అమెరికా విధానంపై భారత్ తటస్థంగా వ్యవహరించే అవకాశముంది.