‘గెలిపిస్తే కుటుంబానికో ప్రభుత్వ ఉద్యోగం..’
x

‘గెలిపిస్తే కుటుంబానికో ప్రభుత్వ ఉద్యోగం..’

సీట్ల భాగస్వామ్యం, ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్న RJC నేత తేజస్వి యాదవ్..


Click the Play button to hear this message in audio format

తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు ఆర్జేడీ(RJD) నేత తేజస్వి యాదవ్(Tejashwi Yadav). కొత్త ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోనే చట్టాం కూడా తీసుకువస్తామని ప్రకటించారు. బీహార్‌(Bihar)లో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Polls) జరగనుండడంతో పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి.

"ఎన్డీఏ(NDA) 20 ఏళ్లలో యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోయింది. మేం అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే చట్టం చేసి 20 నెలల్లో అమలయ్యేలా చూస్తాం. గత ఎన్నికల్లో కూడా నేను ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చా. నేను అధికారంలో ఉన్నపుడు 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చా." అని 35 ఏళ్ల బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి పాట్నాలో విలేకరుల సమావేశంలో అన్నారు. నితీష్ ఈ మధ్య ప్రకటించిన ఎన్నికల హామీలన్నీ మునుపటి ఎన్నికల వాగ్ధానాలేనని గుర్తుచేశారు.

ఇటీవల నితీష్(Nitish Kumar) ప్రభుత్వం 125 యూనిట్ల ఉచిత కరెంటు హామీ అమల్లోకి తెచ్చింది. అభ్యర్థులకు పరీక్ష ఫీజు రద్దు చేశారు. మహిళలకు రిజర్వు చేసిన సీట్లలో "డొమిసైల్ కోటా"ను ప్రవేశపెట్టారు. సామాజిక పింఛన్లను పెంచారు.

మహిళల ఖాతాల్లోకి రూ. 10 వేల జమ..

ఇక ఎన్నికల ప్రకటనకు వారం ముందు 'ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన'ను నితీష్ ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని కోటి మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 10వేల చొప్పున జమచేశారు. మహిళా సాధికారత కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చామని ఎన్డీఏ ప్రచారం చేసుకుంటుంది. అయితే ఎన్నికలకు ముందు ఓటర్లకు నితీష్ ఇస్తున్న "లంచం"అని తేజస్వి ఆరోపించారు. సీట్ల సర్దుబాటు, ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయడం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు 14వ తేదీ జరుగుతుంది.

Read More
Next Story