నేను నితీశ్ కుమార్‌ను రెండుసార్లు కాపాడా’
x

'నేను నితీశ్ కుమార్‌ను రెండుసార్లు కాపాడా’

ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ పార్టీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నితీశ్ కుమార్ నాయకత్వంలోని 'పనికిరాని ప్రభుత్వం' వెళ్లిపోయే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.


ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు. ఇప్పటి నుంచే రాజకీయ వేడి మొదలైంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఆర్‌జేడీ (RJD) నేత తేజస్వీ యాదవ్(Tejashwi Yadav), ముఖ్యమంత్రి నితీష్ కుమార్( Nitish Kumar) ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు.

‘‘నేనే అతన్ని (నితీశ్ కుమార్‌ను) రెండుసార్లు కాపాడా. నేను సాయపడకపోయిఉంటే జేడీయూ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేది,’’ ఇవి తేజస్వీ వ్యాఖ్యలివి. "నేనే లాలూ ప్రసాద్ యాదవ్‌ను రాజకీయంగా ఎదిగేలా చేశాను" అని నితీశ్ కుమార్ అసెంబ్లీలో తేజస్వీకి ఇచ్చిన కౌంటర్. అసెంబ్లీ వేదికగా ఇద్దరి మధ్య వాడీవేడి చర్చ జరిగింది.

రాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. తేజస్వీ యాదవ్, నితీశ్ కుమార్ బీహార్ అభివృద్ధిపై స్వరం పెంచారు. గవర్నర్ ప్రసంగానికి కృతజ్ఞతా తీర్మానంపై చర్చలో పాల్గొన్న తేజస్వీ.. 2005కి ముందు బీహార్‌లో "శక్తివంతమైన ప్రభుత్వం" ఉండేదని, అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. నితీశ్ కుమార్ ప్రస్తుత పాలన పనికిరాని స్థితిలో ఉందని, ప్రజలను నిరాశపరిచిందని ఆరోపించారు.

దీనికి నితీశ్ కుమార్ స్పందిస్తూ.. "మీ తండ్రిని ఈ స్థాయికి తీసుకురావడం నా వల్లే సాధ్యమైంది. మునుపు బీహార్‌లో ఏం ఉండేది? నేనే లాలూని (Lalu Prasad Yadav) పైకి తెచ్చా. మీ కులానికి చెందిన వారే ఎందుకు ఇలా చేస్తున్నావు? అని నన్ను ప్రశ్నించారు. అయినా.. నేను లాలు ప్రసాద్ యాదవ్‌కు మద్దతిచ్చా," అని తేజస్వీకి సమాధానమిచ్చారు.

‘బీహార్‌కు కొత్త వాహనం కావాలి’

అసెంబ్లీ సమావేశాల తర్వాత.. RJD కార్యకర్తల సమావేశంలో నితీశ్ కుమార్‌ను "రిటైర్డ్ అండ్ టైర్డ్" (విరామాన్ని తీసుకోవాల్సిన, అలిసిపోయిన నాయకుడు)గా అభివర్ణించారు తేజస్వీ. ‘‘నితీశ్ కుమార్ వయసురీత్యా ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు. రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలు. మీకు 75 ఏళ్ల ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా? ఆయన మంత్రుల పేర్లు చెప్పమంటే, తన ఇద్దరు డిప్యూటీల పేర్లు కూడా నితీశ్ చెప్పలేరు. బీహార్ ప్రజలు పనికిరాని ప్రభుత్వాన్ని ఏ మాత్రం అంగీకరించరు. అలసిపోయిన ముఖ్యమంత్రి ప్రజలకు అవసరం లేదు. ఇప్పుడు పాత వాహనాలు పనిచేయవు. ఇప్పుడు కొత్త వాహనంతో బీహార్‌ను ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది. 2025లో మా ప్రభుత్వం రావడం ఖాయం," అని తేజస్వీ అన్నారు.

బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) 2025 నవంబర్‌లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో RJD, JD(U) పార్టీల మధ్య రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది.

Read More
Next Story