
సీఎం మమత బెనర్జీపై CBI విచారణకు ED డిమాండ్..
అక్రమ లావాదేవీలు జరిగాయంటూ ఐ-పాక్ (I-PAC) పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు..
వెస్ట్ బెంగాల్(West bengal)లో రాజకీయ వాతావరణం మరోసారి ఉద్రిక్తంగా మారింది. రాజకీయ వ్యూహకర్త సంస్థ ఐ-పాక్ (I-PAC) పై Enforcement Directorate (ED) నిర్వహించిన సోదాల వ్యవహారంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)పై CBI విచారణ జరిపించాలని కోరుతూ ED కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది.
మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల ఐ-పాక్‌కు చెందిన కార్యాలయాలు, డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసాల్లో ED అధికారులు కోల్ స్కామ్‌కు సంబంధించి సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో సుమారు రూ.20 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. సోదాలు కొనసాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలీసు అధికారులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఆ సందర్భంగా డిజిటల్ పరికరాలు, ఫైళ్లు, కీలక డాక్యుమెంట్లు అక్కడి నుంచి తీసుకెళ్లారని, ఇది దర్యాప్తును అడ్డుకునే చర్యగా భావిస్తున్నట్లు ED తన పిటిషన్‌లో పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే CBI దర్యాప్తు అవసరమని ED కోర్టును కోరింది. అలాగే తీసుకెళ్లిన డిజిటల్ పరికరాలు, పత్రాలను వెంటనే తమకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడటంతో కలకత్తా హైకోర్టు ఈ కేసు విచారణను జనవరి 14కి వాయిదా వేసింది.
మరోవైపు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరియు ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఈ చర్యలను తీవ్రంగా ఖండించాయి. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రతీకార చర్య అని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మమతా ఆరోపించారు. ఈ చర్యలకు నిరసనగా ఆమె కొల్‌కతాలో రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
టీఎంసీ ప్రత్యేక పిటిషన్ దాఖలు..
ED దాడుల చట్టబద్ధతను సవాలు చేస్తూ ..అధికార దుర్వినియోగం, ఎన్నికల డేటాతో సహా కొన్ని కీలక పత్రాలను చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ TMC హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. రెండు పిటిషన్లు జనవరి 14న కలిసి విచారణకు వచ్చే అవకాశం ఉంది.
టీఎంసీ నిరసనలు, ఈడీకి బీజేపీ మద్దతు
ఆధారాల ఆధారంగానే దాడులు చేశామని, రాజకీయ పార్టీలను లక్ష్యంగా చేసుకోలేదని ఈడీ స్పష్టం చేసింది. అయితే ప్రతిపక్ష పార్టీలను అణగదొక్కడానికి కేంద్రం ఈడీని ఉసిగొలిపిందని టీఎంసీ వాదిస్తోంది.
ఈ అసమ్మతి ప్రజా ప్రదర్శనలకు కూడా దారితీసింది. TMC అధినేత్రి స్వయంగా కోల్‌కతాలో నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించగా..EDకి BJP మద్దతు ఇచ్చింది.

