
హకీంపూర్ వద్దకు వందలాదిగా చేరుకున్న బంగ్లాదేశీయులు..
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియనే కారణమా?
పశ్చిమ బెంగాల్(West Bengal) రాష్ట్రం ఉత్తర 24 పరగణాల పరిధిలోని హకీంపూర్ చెక్‌పోస్ట్ వద్దకు వందల సంఖ్యలో బంగ్లాదేశ్(Bangladeshis) జాతీయులు చేరుకున్నారు. వీరంతా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా BSF పోలీసులు అడ్డుకున్నారు. బెంగాల్లో ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (S.I.R) జరుగుతోంది. చట్టపర ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు తాము భారత్ నుంచి తమ దేశానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు(Rohingyas) తెలిపారు. తామంతా"చట్టవిరుద్ధంగా" భారత్‌లోకి ప్రవేశించామని అంగీకరించారు. కోల్‌కతా చుట్టుపక్కల ప్రాంతాలలో బిరాటి, మధ్యగ్రామ్, రాజర్హాట్, న్యూ టౌన్, సాల్ట్ లేక్ ప్రాంతాల్లో నివసిస్తున్నామని, ఇళ్లలో పని మనుషుల్లాగా, దినసరి కూలీలుగా, నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగించినట్లు మీడియాకు చెప్పారు.
S.I.R భయం..
వాస్తవానికి S.I.R ప్రారంభమైనప్పటి నుంచి బంగ్లాదేశ్‌కు తిరిగి ప్రయాణం ప్రారంభమైంది. ఇదే సరిహద్దు గుండా తిరిగి భారత్‌లోకి రావడానికి ప్రయత్నించిన 90 మంది బంగ్లాదేశ్ జాతీయులు, రోహింగ్యాలను BSF అరెస్టు చేసింది.
బంగ్లాదేశ్ మహిళా తక్లిమా ఖాతున్ ది ఫెడరల్‌తో మాట్లాడుతూ.. "నేను భారత్‌కు వచ్చి పదేళ్లువుతుంది. అద్దె ఇంట్లో ఉంటూ ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నా. నా దగ్గర ఎటువంటి పత్రాలు లేవు. ఇప్పుడు నేను సత్ఖిరా (బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఊరు)కి తిరిగి వెళ్లాలనుకుంటున్నా" అని చెప్పారు.
"మేము రెండేళ్ల క్రితం ఒక బ్రోకర్ ద్వారా డంకునికి వచ్చాం. ఇప్పుడు S.I.R జరుగుతోంది. మేం మా ఊరికి తిరిగి వెళ్లులానుకుంటున్నాం. నా భర్త, నేను, నా చిన్న కూతురు రెండు రోజులుగా హకీంపూర్ వద్ద వేచి ఉన్నాం. BSF మా బంగ్లాదేశ్ పత్రాలను తీసుకుంది’’ అని మరో మహిళ రుబీనా బీబీ పేర్కొన్నారు.
‘వలసలు సాధారణమే’
బెంగాల్ సరిహద్దు వద్ద వలసలు సాధారణమేనని పశ్చిమ బెంగాల్‌కు చెందిన మానవ హక్కుల సమూహం బంగ్లార్ మనబధికర్ సురక్ష మంచా (MASUM) కార్యదర్శి కిరీటీ రాయ్ పేర్కొన్నారు. ‘‘సరిహద్దుకు ఇరువైపుల నుంచి ప్రజలు వలస వెళ్లడం అసాధారణమేం కాదు. చాలా ఏళ్లుగా జరుగుతోంది. ఈసారి వందలాది మంది ఒకేసారి సరిహద్దు దాటడానికి ప్రయత్నించడం అందరి దృష్టిని ఆకర్షించింది’’, S.I.R భయమే అందుకు కారణమని రాయ్ అంగీకరించారు.
ముగిసిన డెడ్‌లైన్..
అక్రమ వలసదారులు(Illegal Immigrants) స్వచ్ఛందంగా బంగ్లాదేశ్ వెళ్లి పోయేందుకు ప్రభుత్వం ఈ ఏడాది జూన్ వరకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం S.I.R మొదలు కావడంతో స్వచ్ఛదంగా వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని బిథారి-హకీంపూర్ గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు జెస్మినా పర్విన్ సర్దార్ ది ఫెడరల్‌కు ఫోన్లో తెలిపారు.
"ప్రభుత్వం మమ్మల్ని అరెస్టు చేయకుండా మాకు అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని ఇప్పుడు వినియోగించుకుంటున్నాం." అని 23 ఏళ్ల దృష్టి లోపం ఉన్న వ్యక్తి మెహెది హసన్ అహ్మద్ అన్నారు. ఇతను 20 సంవత్సరాల క్రితం కంటి చికిత్స కోసం తల్లిదండ్రులతో కలిసి చట్టవిరుద్ధంగా భారతదేశానికి వచ్చాడు.
స్వదేశానికి తిరిగి పంపుతున్న బీఎస్ఎఫ్..
హకీంపూర్ చెక్-పాయింట్ దగ్గర టార్పాలిన్ షెల్టర్లను ఏర్పాటు చేసింది బిఎస్ఎఫ్. స్వదేశానికి తిరిగి పంపే ముందు వారి వద్ద ఉన్న ధృవీకరణ పత్రాలను చూసి పంపుతోంది. "బంగ్లాదేశ్ పత్రాలను తనిఖీ చేస్తున్నాం", అక్రమ మార్గంలో పొందిన భారత్ ఆధార్ లేదా ఓటరు ID వంటి స్వాధీనం చేసుకుంటున్నామని’’ బీఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

