
కార్లు, ఆటో విడి భాగాలపై భారీగా సుంకాల తగ్గింపు
భారత్–ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)లో 110% నుంచి 10%కి తగ్గనున్న టారిఫ్..
భారత్–యూరోపియన్(India-EU) యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)తో కార్లు సహా ఆటోమొబైల్ రంగంపై ఉన్న దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గనున్నాయి. ప్రస్తుతం ఈయూ నుంచి భారత్‌కు ఏటా సుమారు 2.5 లక్షల కార్లు దిగుమతి అవుతుండగా, వీటిపై 110 శాతం వరకూ టారిఫ్(Tariffs)లు అమలులో ఉన్నాయి. తాజా ఒప్పందం ప్రకారం ఇవి క్రమంగా 10 శాతానికి తగ్గుతాయి.
కారు విడి భాగాలపై ఐదు నుంచి పది సంవత్సరాల పాటు పూర్తిస్థాయి సుంక మినహాయింపు కల్పించనున్నారు. అలాగే యంత్రాలపై 44 శాతం, రసాయనాలపై 22 శాతం, ఔషధాలపై 11 శాతం వరకు ఉన్న సుంకాలను తొలగించనున్నారు. ఈ చర్యలతో ఆటో, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో దిగుమతి ఖర్చులు తగ్గి, ధరలపై సానుకూల ప్రభావం పడే అవకాశముంది.
వ్యవసాయ రంగంలోనూ పరస్పర మార్కెట్ యాక్సెస్ విస్తరించనుంది. భారతీయ వ్యవసాయ ఎగుమతులపై ఈయూ విధించే సగటు 36 శాతం సుంకాలు తొలగించాల్సి ఉంటుంది. అదే సమయంలో భారత్‌లో వైన్‌లపై ఉన్న 150 శాతం సుంకాలు అమలులోకి వచ్చిన తరువాత దశలవారీగా 75 శాతానికి, చివరకు 20 శాతానికి తగ్గుతాయి. ఆలివ్ ఆయిల్‌పై ఐదు సంవత్సరాల్లో 45 శాతం నుంచి సున్నా శాతానికి సుంకాలు తగ్గిస్తారు. ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులపై ఉన్న 50 శాతం టారిఫ్‌లు కూడా రద్దు కానున్నాయి.
బీఫ్, కోడి మాంసం, బియ్యం, చక్కెర వంటి వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో పరిమిత సడలింపులు ఉంటాయని, అదే సమయంలో యూరోపియన్ రైతుల ప్రయోజనాలు కాపాడతామని ఈయూ స్పష్టం చేసింది. ఈయూకు ఎగుమతి అయ్యే భారతీయ ఉత్పత్తులు యూరోపియన్ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
ఒప్పందం కుదిరిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ ఒప్పందాన్ని రెండు పక్షాలు ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్’గా అభివర్ణించాయి. ఇది ప్రపంచ జీడీపీలో సుమారు 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు మూడో వంతు వాటా ఉన్న రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య కుదిరిన కీలక ఒప్పందమని పేర్కొన్నారు.
2007లో ప్రారంభమైన భారత్–ఈయూ ఎఫ్టీఏ చర్చలు 2013లో నిలిచిపోయి, 2022 జూన్‌లో తిరిగి మొదలయ్యాయి. ప్రస్తుతం ఈయూ భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత్–ఈయూ మధ్య మొత్తం వస్తువుల వ్యాపారం సుమారు 136 బిలియన్ అమెరికన్ డాలర్లుగా నమోదైంది. ఇందులో భారత్ ఎగుమతులు 76 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతులు 60 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

