కేంద్రం ఈసీని హైజాక్ చేసిందా?
x

కేంద్రం ఈసీని హైజాక్ చేసిందా?

ఓటర్ జాబితాల గోల్‌మాల్‌పై రాహుల్ గాంధీ ఆందోళన


పార్లమెంటు(Parliament)లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓటరు జాబితా గోల్‌మాల్ అంశంపై చర్చకు డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో మామూలుగా చర్చించని ఈ అంశాన్ని ఆయన జీరో అవర్‌లో ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఓటరు జాబితాలను తయారు చేయకపోయినా..వాటిలో జరుగుతున్న మోసాలపై చర్చ అత్యవసరం అని రాహుల్ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకెళ్లారు.

బీజేపీ అండతో ఎన్నికల సంఘం(Election commission) ఓటరు జాబితా(Voter list)లను తారుమారు చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ‘కాపిటల్ బీట్’ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయవాది, ఉద్యమకారుడు మహ్మద్ ప్రాచా(Mehmood Pracha) ..రాహుల్ వ్యాఖ్యలను విశ్లేషించారు.

ప్రాచా ఏమంటారంటే..

"స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికలు జరగకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది," అని ప్రాచా హెచ్చరించారు. "దేశాన్ని కాపాడాలంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే, ప్రజా తీర్పును రక్షించాలి" అని పేర్కొన్నారు.

రాహుల్ వ్యాఖ్యలపై స్పీకర్ ఓం బిర్లా కొంత ఇబ్బంది పడినట్లు కనిపించారని ప్రాచా అభిప్రాయపడ్డారు. "ప్రభుత్వం ఓటరు జాబితాలను రూపొందించదు" అన్న బిర్లా వ్యాఖ్యను రాహుల్ అంగీకరించకపోయినా.. చర్చ కొనసాగాలని పట్టుబట్టారని తెలిపారు. గతంలో బీజేపీ ప్రభుత్వం వివాదాస్పద ఎన్నికల అంశాలపై చర్చలకు సహకరించలేదు. ఈసారి కూడా అదే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఎన్నికల కమిషనర్ల నియామకం..

ఎన్నికల కమిషనర్ల నియామకం రాజకీయ ప్రేరితంగా మారింది. "ప్రస్తుత ఎన్నికల కమిషనర్లు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. వారు స్వతంత్ర సంస్థకు బదులుగా బీజేపీ రాజకీయ ప్రయోజనాలను కాపాడేలా వ్యవహరిస్తున్నారు" అని ప్రాచా ఆరోపించారు.

కేవలం అవగాహనతో సరిపోదు..

ఓటరు జాబితాలో మోసాలపై అవగాహన పెంచేందుకు ప్రతిపక్ష పార్టీలు ఉద్యమాలు ప్రారంభించాయి. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ప్రచారం ప్రారంభించింది. మహారాష్ట్రలో "జనసునవాయి" అనే ఉద్యమం కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో "ఎపిక్ స్కాం" పేరుతో తృణమూల్ కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. ప్రాచా ప్రకారం.. ‘‘మంచి కోసం ఉద్యమాలు చేపట్టినా.. చట్టపర చర్యలు అవసరం. కేవలం అవగాహనతో సరిపోదు. ఎన్నికల మోసాలకు పాల్పడిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి" అని సూచించారు.

ఈసీ బ్లేమ్ గేమ్..

Duplicate voter IDలు ఉన్నట్లు ఎన్నికల సంఘం (EC) అంగీకరించినా..ఆ నెపాన్ని బూత్ లెవల్ ఏజెంట్ల (BLAs)పైకి నెట్టేస్తుంది. రాజకీయ పార్టీలు BLAలు ఈ లోపాలను గుర్తించాలి" అని ఓ ప్రకటనలో కోరింది. కానీ ప్రాచా ఈ వివరణను కొట్టిపారేశారు. "BLAలు కేవలం వీక్షకులే. ఓటరు జాబితాల్లో తప్పులను సరిచేయాల్సిన బాధ్యత ఎన్నికల నమోదు అధికారులదే. ఎన్నికల సంఘమే దానికి పూర్తి బాధ్యత వహించాలి" అని అన్నారు.

ప్రజాస్వామ్యం భవిష్యత్ ఏమిటి?

ఓటరు జాబితాలో అవకతవకలు, EVMల మోసంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు మొదలెట్టినా.. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగుతుందా? అన్నది సందేహాస్పదమే. "ప్రభుత్వం దీనిపై చర్చకు ఒప్పుకునే అవకాశమే లేదు. ఎందుకంటే దీని వెనక బలమైన రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి" అని ప్రాచా అభిప్రాయపడ్డారు. అయితే ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని కోర్టుదాకా తీసుకెళ్లి చట్టపర చర్యలు తీసుకుంటే గాని, భారత ఎన్నికల ప్రక్రియలో నిజమైన మార్పు రావడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More
Next Story