‘దేశసేవ చేయాలన్న కోరికను నీరుగార్చారు’
x

‘దేశసేవ చేయాలన్న కోరికను నీరుగార్చారు’

హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ బీజేపీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే డ్రగ్స్‌ఫ్రీ స్టేట్‌గా మారుస్తానని హామీ ఇచ్చారు.


దశాబ్ద కాలంలో యువతకు ఉపాధి కల్పించే ప్రతి వ్యవస్థ వెన్నెముకను హర్యానా బీజేపీ ప్రభుత్వం విరిచేసిందని లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన మహేంద్రగఢ్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు. రాహుల్ వెంట పార్టీ నేతలు భూపీందర్‌ సింగ్‌ హుడా, కె.సి. వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రబలంగా ఉన్న నిరుద్యోగ సమస్య యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. 'పరివార్ పెహచాన్ పత్ర'తో రిక్రూట్‌మెంట్‌ను నిలిపివేసి కుటుంబాలను విచ్ఛిన్నం చేశారన్నారు. డ్రగ్స్‌ బారిన పడి యువత పెడదోవ పడుతుందన్నారు. నిరాశ చెందిన యువత నేరాల బాట పడుతోంది. డుంకీ లాంటి ప్రమాదాల ప్రయాణంతో కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నివీర్‌ పథకం తెచ్చి దేశసేవ చేయాలన్న యువత కోరికను నీరుగార్చారని ఆరోపించారు.

గెలిపిస్తే 2 లక్షల ఉద్యోగాలు..

తమను గెలిపిస్తే 2 లక్షల పర్మినెంట్ ఉద్యోగాలు కల్పిస్తామని, హర్యానాను డ్రగ్స్ ఫ్రీగా మారుస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. దేశంలో చిన్న ఉత్పత్తిదారులను ప్రోత్సహించి, అవకాశాలు కల్పిస్తే ప్రపంచానికి తమ ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసుకోగలరని చెప్పారు. వారికి ఆర్థిక, సాంకేతికత, బ్రాండింగ్ తదితరాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. లోపభూయిష్ట జీఎస్టీ, నోట్ల రద్దుతో బీజేపీ చిన్న వ్యాపారాలకు పెద్ద దెబ్బ కొట్టారని విమర్శించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చే వేగవంతమైన ఆర్థిక వృద్ధి అవసరమని, ప్రపంచ వేదికపై పోటీపడే మరింత ఉత్పాదక ఆర్థిక వ్యవస్థ అవసరమని గాంధీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ క్యాపిటలిస్టు విధానాల ‘చక్రవ్యూహాన్ని’ కూల్చివేయడానికి సిద్ధం కావాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు శనివారం పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Read More
Next Story