హర్యానా కా లాల్ ను గెలిపించాలని కోరుతున్నదెవరు?
x

"హర్యానా కా లాల్ "ను గెలిపించాలని కోరుతున్నదెవరు?

ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత హర్యానాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాషాయ పార్టీ, ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.


హర్యానాలో ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన భర్తను "హర్యానా కా లాల్ " (హర్యానా కుమారుడు)గా అభివర్ణిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

ఆప్ ఒంటరిపోరు..

హర్యానాలో అధికార బీజేపీని గద్దెదించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేయాలని భావించింది. అయితే సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఒంటరిపోరుకు సిద్ధమైంది.

‘మీ కొడుకు మోదీకి లొంగడు’

బూటకపు కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిని కటకటాల వెనక్కి నెట్టారని సునీత ఆరోపించారు. “మీ కొడుకు (అరవింద్ కేజ్రీవాల్) సింహం. అతను (ప్రధాని నరేంద్ర) మోదీకి లొంగడు. నేను, మీ కోడలు, మీ సోదరిలా అడుగుతున్నా.. కేజ్రీవాల్‌కు జరిగిన అవమానాన్ని హర్యానా తట్టుకుంటుందా? మీరు మౌనంగా ఉంటారా? మీ కుమారుడికి (ఢిల్లీ సిఎం) మద్దతు ఇవ్వలేదా? అని భివానీలో నిర్వహించిన ప్రచార సభలో ఉద్వేగంగా ప్రసంగించారు.

బీజేపీపై విరుచుకుపడ్డ సునీత..

‘‘బీజేపీ కేవలం అధికారంలో మాత్రమే కొనసాగాలని కోరుకుంటుంది. ప్రజా సంక్షేమం కోసం పని చేయాలన్న తపన ఆ నాయకుల్లో లేదు. పార్టీలను ఎలా విచ్ఛిన్నం చేయాలో, ప్రతిపక్ష నేతలను ఎలా జైల్లో పెట్టాలో బీజేపీకి మాత్రమే తెలుసు. గత 10 సంవత్సరాలలో విద్య, ఆరోగ్య రంగాలలో ఏదైనా అభివృద్ధిని చూశారా? ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మెరుగుపడిందా? మీ ప్రాంతంలో ఏదైనా ఆసుపత్రిలో మంచి వైద్యం అందిస్తారా? ఉచితంగా మందులు ఇస్తున్నారా? మీకు ఉచితంగా కరెంటు ఇస్తున్నారా? ’’ అని సునీత బీజేపీపై విరుచుకుపడ్డారు.

మోదీకి అందుకే అసూయ..

‘‘అరవింద్ కేజ్రీవాల్ "హర్యానా కా లాల్ " (హర్యానా కుమారుడు). సివానీ గ్రామంలో జన్మించి, హిసార్‌లో పెరిగాడు. హర్యానా కొడుకు ఢిల్లీ సీఎం అవుతాడని ఎవరూ కలలో ఊహించి ఉండరు. ఇది సాధారణ విషయం కాదు. జీరోతో ప్రారంభించి సొంత పార్టీ పెట్టి తొలి ఎన్నికల్లోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. పెద్ద పార్టీలు, పెద్ద నాయకులు కూడా చేయలేని పనులను కేజ్రీవాల్ చేశారు. వీటన్నింటి చాలా దగ్గర నుంచి గమనిస్తున్న ప్రధాని మోదీ మీ కొడుకు, మీ సోదరుడు (కేజ్రీవాల్) పట్ల అసూయకు పెంచుకున్నారు. ప్రధాని మంచి విద్య, వైద్యం అందించలేకపోతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఆ పని చేశారు. కేజ్రీవాల్ కి రోజురోజుకు పెరిగిపోతున్న ఆదరణను మోదీ జీర్ణించుకోలేక, తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టించారు’’ అని సునీత మోదీపై ధ్వజమెత్తారు.

" చీపురు గుర్తుకు ఓటు వేయండి"

ఆప్ జాతీయ కన్వీనర్ కూడా అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ర్యాలీలో సునీత మాట్లాడుతూ.. “వారు కేజ్రీవాల్‌ను ' చోర్ ' (దొంగ) అని అంటున్నారు. అతను ' చోర్ ' అయితే ప్రపంచంలో ఎవరూ నిజాయితీపరులు కాదు. ఈ ఎన్నికలు హర్యానా ఆత్మ గౌరవానికి సంబంధించినవి. అక్టోబర్ 5 న ' చీపురు' గుర్తు బటన్‌ను నొక్కి అభ్యర్థులను గెలిపించండి’’ అని సునీత కోరారు.

ఆప్ హామీలివి..

తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ, పంజాబ్‌ల మాదిరిగానే రాష్ట్రంలో ఉచిత విద్యుత్, 24 గంటల విద్యుత్ సరఫరా ఉంటుందని చెప్పారు.‘‘నగరాలు, గ్రామాల్లో ' మొహల్లా [పొరుగు] క్లినిక్‌లు ఉంటాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉపాధి కల్పిస్తాం. ప్రతి మహిళకు నెలకు రూ.1,000 అందుతుంది. త్వరలో ఈ పథకాన్ని ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్ ప్రభుత్వం అమలు చేస్తుంది.’’ అని చెప్పారు.

హర్యానా అసెంబ్లీలో 90 మంది సభ్యులున్నారు. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 8న జరగనుంది.

Read More
Next Story