
గోవాలో AAPకు ఎదురుదెబ్బ..
పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు అమిత్ పాలేకర్, తాత్కాలిక చీఫ్ శ్రీకృష్ణ పరాబ్ సహా మరో ముగ్గురు రాజీనామా ..
గోవా(Goa)లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి సోమవారం (జనవరి 5) పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు అమిత్ పాలేకర్, తాత్కాలిక చీఫ్ శ్రీకృష్ణ పరాబ్, మరో ముగ్గురు ఆఫీసర్లతో సహా పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు పాలేకర్, పరాబ్, గోవా ఆప్ యువజన విభాగం అధ్యక్షుడు రోహన్ నాయక్ విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.
‘‘ఆప్‌తో నా నాలుగేళ్ల ప్రయాణం ముగిసింది. పార్టీని వీడుతున్నందుకు నాకు ఎలాంటి బాధ లేదు. పార్టీ కోసం చేయగలిగినంతా చేశా’’ అని పాలేకర్ పేర్కొన్నారు.
గోవాలో డిసెంబర్ 20న పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 42 స్థానాల్లో అభ్యర్థులు పోటీచేశారు. కాని ఒక స్థానంలో మాత్రమే గెలిచారు. దీంతో పాలేకర్ అధ్యక్ష పదవిని కోల్పోయారు.
ఇద్దరు ఆప్ ఉపాధ్యక్షుల రాజీనామా..
గోవా ఆప్ ఉపాధ్యక్షులు చేతన్ కామత్, సర్ఫరాజ్ కూడా పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. అయినప్పటికీ వారు విలేఖరుల సమావేశానికి హాజరుకాలేదు.
2022 గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాలేకర్ ఆప్‌లో చేరారు. 40 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఆ పార్టీ కేవలం రెండు సీట్లను మాత్రమే గెలుచుకుంది.

