
BMC మేయర్ ఎంపిక విషయంలో అంతర్గత విభేదాలు?
ఏక్‌నాథ్ షిండే తమ కార్పొరేటర్లను హోటల్‌కు తరలించడం వెనక అసలు కారణం అదేనా? షిండే తీరుపై మంత్రి గణేష్ నాయక్ అసహనం..
మహారాష్ట్ర(Maharashtra)లో మున్సిపల్ ఎన్నికల తర్వాత బీజేపీ(BJP) - ఏక్నాథ్ షిండే(Eknath Shinde) (శివసేన) మధ్య అంతర్గత విభేదాలు తలెత్తాయన్న వార్తలొస్తున్నాయి. అది కూడా BMC మేయర్ ఎంపికలో. ఎన్నికలలో మహాయుతి కూటమి పైచేయి సాధించినా.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC) పీఠంపై ఏ పార్టీ కార్పొరేటర్‌ను కూర్చోబెట్టాలన్న దానిపై చర్చ జరుగుతోంది. ఈ నెల ప్రారంభంలో షిండే తన కార్పొరేటర్లను ఫైవ్ స్టార్ హోటల్‌కు తరలించడంమే కూటమిలో అంతర్గత విభేదాలకు ఆజ్యం పోసింది.
మేయర్ పదవిపైనే వివాదం..
మహారాష్ట్రలోని 2,869 వార్డులకుగాను షిండే సేన 399 వార్డులు గెలుచుకుని ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచింది. మెజారిటీ మార్కు దాటడంలో సహకరించింది. అయితే ముంబై మేయర్ ఎంపికపై వివాదం తలెత్తింది. ఆ పదవిని తమ కార్పొరేటర్లలో ఒకరికి ఇవ్వాలని షిండే వర్గం ఒత్తిడి చేస్తోంది. ఈ డిమాండ్‌ను బీజేపీలోని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి.
మరోవైపు మంత్రి గణేష్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
పార్టీ అనుమతిస్తే షిండేను రాజకీయాల నుంచి తొలగిస్తానని ఇటీవల ఒక కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రి గణేష్ నాయక్ అన్నారు. బీజేపీ-షిండే సేన పొత్తుతో గణేష్ కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీ స్వతంత్రంగా పోటీ చేసి ఉంటే ఇంకా మెరుగైన ఫలితాన్ని వచ్చేవని ఆయన వాదన.
‘‘అధిష్టానం నిర్ణయానికి కట్టుబడే’’
బీజేపీ(BJP) క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, పార్టీ నాయకత్వం నిర్ణయాలకు కట్టుబడి పనిచేసే పార్టీ అని చెప్పుకొచ్చిన నాయక్.. "పార్టీ ఆదేశం మేరకే కలిసి పోటీచేశామని, అది మాకు నచ్చకపోయినా కార్యకర్తలతో ఒప్పించాం.’’ అని గణేష్ చెప్పినట్లు ABP పేర్కొంది. అయితే మేయర్ పదవిపై బీజేపీ, షిండే సేన కలిసి సామరస్యపూర్వక నిర్ణయం తీసుకుంటారని గణేష్ అభిప్రాయపడ్డారు.

