Flash News| మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు.
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు గురువారం రాత్రి 8 గంటలకు తరలించారు. 92 ఏళ్ల మాజీ ప్రధానిని వెంటనే వైద్యులు అత్యవసర వైద్య విభాగానికి మార్చారు. చికిత్స పొందుతూ 9.51 గంటలకు తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ మరణ వార్త తెలిసి కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఆస్పత్రికి చేరుకున్నారు.
1991-96 మధ్య పీవీ నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు. యూపీఎ హయంలో రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేశారు.
మే 22, 2004న ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సింగ్, మే 26, 2014 వరకు వరుసగా రెండు పర్యాయాలు పనిచేశారు. మొత్తం 3,656 రోజుల పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) ప్రభుత్వానికి నాయకత్వం వహించి, అత్యధిక కాలం పనిచేసిన మూడో ప్రధానిగా నిలిచారు. జవహర్‌లాల్ నెహ్రూ 6,130 రోజులు, ఇందిరా గాంధీ 5,829 రోజులు పనిచేశారు. భారతదేశానికి 14వ ప్రధానమంత్రిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందారు.
సెప్టెంబరు 26, 1932న పశ్చిమ పంజాబ్‌లోని గాహ్ గ్రామంలో (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) జన్మించిన సింగ్.. చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ చేశారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు.
1971లో ఇందిరాగాంధీ హయాంలో విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు ఆర్థిక సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియమితులై 1976 వరకు ఆ పదవిలో ఉన్నారు.
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు.