బీహార్‌కు భారీగా ప్రోత్సాహకాలు, ప్రాజెక్టులు.. కారణమేంటి?
తెలంగాణ, ఏపీకి బడ్జెట్‌లో మొండిచేయి చూపించినా.. నితీష్ కుమార్ జేడీయూ పాలిత బీహార్‌కు మాత్రం వరాల జల్లు కురిపించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
కేంద్ర బడ్జెట్ 2025ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman ) బీహార్‌కు అనేక ప్రోత్సాహకాలు ప్రకటించారు. వాటిలో మఖానా బోర్డు, గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, వెస్టర్న్ కోశీ కాలువ ప్రాజెక్టుకు ఆర్థిక మద్దతు ముఖ్యమైనవి.
మఖానా అంటే ఏమిటి?
బీహార్‌లో 15,000 హెక్టార్లలో తామరను సాగు చేస్తారు. తామర విత్తనాల (ఫాక్స్ నట్స్)లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపరిచేందుకు, గుండె ఆరోగ్యానికి ఈ విత్తనాలను విరివిగా వాడతారు. ఈ పంట సాగుకు రైతులు నీటిలోకి దిగాల్సి ఉంటుంది. వాటి విత్తనాలను సేకరించి, ఎండబెట్టి, అధిక ఉష్ణోగ్రత వద్ద వేయించి ఫాక్స్ నట్స్‌గా తయారు చేస్తారు. మఖానా ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ కోసం బీహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
బీహార్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ..
ఫుడ్ ప్రొసెసింగ్ రంగానికి పెద్దపీఠ వేస్తూ..బీహార్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంట్రప్రెన్యూర్షిప్, మేనేజ్‌మెంట్ (NIFTEM) ఏర్పాటు చేయనుంది. ఫలితంగా ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధి జరగనుంది.
విమానాశ్రయ విస్తరణ ..
బీహార్‌లో పాట్నా ఎయిర్‌పోర్ట్ విస్తరణ, బిహ్తాలో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణం చేపడతామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే రాష్ట్ర భవిష్యత్ అవసరాలను తీర్చేందుకు కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను కూడా ప్రోత్సహిస్తామని చెప్పారు.
వెస్టర్న్ కోశీ కాలువ ప్రాజెక్టుకు ఆర్థిక మద్దతు
మిథిలాంచల్ ప్రాంతంలోని వెస్టర్న్ కోశీ కాలువ ప్రాజెక్టుకు (Western Koshi Canal Project) కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. "ఈ ప్రాజెక్టు ద్వారా 50 వేల హెక్టార్లలో వ్యవసాయ భూములకు నీరందుతుంది. ఫలితంగా పెద్ద సంఖ్యలో రైతులకు లాభం చేకూరుతుంది,"అని సీతారామన్ అన్నారు.
గత బడ్జెట్‌లోనూ..
2024 జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా బీహార్‌కు భారీ ప్రాజెక్టులు ప్రకటించారు. రూ. 60వేల కోట్ల కేటాయింపులో మూడు ఎక్స్‌ప్రెస్‌వేలు, విద్యుత్ ప్లాంట్, కారిడార్లు, విమానాశ్రయాలు, క్రీడా మౌలిక వసతులు ఉన్నాయి. ఈ ఏడాది బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కేంద్రం బీహార్‌కు మరిన్ని ప్రోత్సాహక పథకాలను ప్రకటించింది.