ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కు ఆప్ చీఫ్ ఐదు ప్రశ్నలు
x

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కు ఆప్ చీఫ్ ఐదు ప్రశ్నలు

‘‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నాకు అగ్ని పరీక్ష కాదు. తాను నిజాయితీపరుడని భావిస్తేనే నాకు ఓటు వేయండి ’’ - కేజ్రీవాల్


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ఎత్తుకు పైఎత్తు వేస్తూ ప్రత్యర్థి పార్టీలను ఇరకాటంలో పెట్టేందుకు యత్నిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బయటకు వచ్చిన రెండు రోజుల తర్వాత ఎవరూ ఊహించని విధంగా తన పదవికీ రాజీనామా చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జంతర్ మంతర్‌ వేదికగా బీజేపీని టార్గెట్ చేసి ప్రసంగించారు. 'జంతా కీ అదాలత్' పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్‌కు కొన్ని ప్రశ్నలు సంధించారు.

పార్టీలను కూల్చడం, ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టడం, అవినీతి నాయకులను స్వాగతించడం, స్వప్రయోజనాలకు కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకోవడాన్ని ఆర్‌ఎస్‌ఎస్ సమర్థిస్తుందా? 75 ఏళ్లు రాగానే పదవీ విరమణ చెయ్యాలనే నిబంధన బీజేపీలో ఉంది. ఇది ప్రధాని మోదీకి వర్తించదా? తమ పార్టీకి సైద్ధాంతిక గురువు ఆర్‌ఎస్‌ఎస్ అవసరం లేదని బిజెపి చీఫ్ జెపి నడ్డా అన్నపుడు మీకు ఎలా అనిపించిందని భగవత్‌ను ప్రశ్నించారు.

దేశానికి సేవ చేసేందుకు మాత్రమే..

దేశానికి సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, అధికారం లేదా పదవి కోసం కాదన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగానే సీఎం పదవికి రాజీనామా చేశానని, గత 10 ఏళ్లలో తాను సంపాదించింది డబ్బు కాదని, గౌరవం మాత్రమేనని అన్నారు.

'అగ్ని పరీక్ష'

త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు తనకు అగ్ని పరీక్ష కాదని చెప్పారు. నిజాయితీపరుడు అని భావిస్తేనే తనకు ఓటు వేయాలని కోరారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఐదు నెలలకు పైగా జైలు జీవితం గడిపిన కేజ్రీవాల్ సెప్టెంబర్ 13న తీహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయిన విషయం తెలిసిందే.

Read More
Next Story