ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియాకు అధ్యక్షుడిగా తొలి భారతీయుడు
ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) అధ్యక్షుడిగా రణధీర్ సింగ్ ఎన్నికయ్యారు. ఓసీఏకు ఎన్నికైన తొలి భారతీయుడు కూడా ఈయనే.
ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) అధ్యక్షుడిగా రణధీర్ సింగ్ ఎన్నికయ్యారు. ఓసీఏకు ఎన్నికైన తొలి భారతీయుడు కూడా ఈయనే. ఏకగ్రీవంగా ఎన్నికయిన రణధీర్ సింగ్ అధ్యక్ష పదవిలో 2024 నుంచి 2028 వరకు కొనసాగుతారు.
పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన క్రీడాకారుల కుటుంబానికి వచ్చిన రణధీర్.. షూటర్‌గా ఐదుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. ఈయన మేనమామ, IOC సభ్యుడయిన మహారాజా యదవీంద్ర సింగ్ ఇండియా తరపున టెస్ట్ క్రికెటర్. తండ్రి భలీంద్ర సింగ్ కూడా ఫస్ట్-క్లాస్ క్రికెటర్. 1947 -1992 మధ్య కాలంలో IOC సభ్యుడు కూడా. రణధీర్ కూడా 2001, 2014 మధ్య IOC సభ్యుడు. ఆ తర్వాత గ్లోబల్ స్పోర్ట్స్ బాడీ గౌరవ సభ్యుడిగా కొనసాగాడు.
77 ఏళ్ల రణధీర్ 2021 నుంచి కువైట్‌కు చెందిన షేక్ అహ్మద్ అల్-ఫహాద్ అల్-సబాహ్ స్థానంలో OCA యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డాడని ఈ ఏడాది మేలో సబాహ్‌పై స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ 15 సంవత్సరాల నిషేధం విధించింది.
OCA జనరల్ అసెంబ్లీకి అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతరులతో పాటు ఈ సెషన్‌కు బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడే కూడా హాజరయ్యారు. ఈ మహాసభలో ఆసియా నుంచి మొత్తం 45 దేశాలు పాల్గొన్నాయి.
భారతీయ, ఆసియా క్రీడా సంస్థలలో వివిధ అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో కొనసాగిన రణధీర్.. క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా, ఆసియాలోని మొత్తం 45 దేశాలకు చెందిన అగ్రశ్రేణి క్రీడా నాయకుల సమక్షంలో అధికారికంగా OCA అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
"నా టీమ్ అందరికీ అభినందనలు. నేను హృదయపూర్వకంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆసియా ఒక కుటుంబం. మద్దతు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మేము చాలా కాలం పాటు కొనసాగించడానికి ప్రయత్నిస్తాము. టీమ్‌లో చేరిన మహిళలందరికీ ప్రత్యేక అభినందనలు.’’ " అని రణధీర్ తన ఎన్నిక తర్వాత చెప్పాడు.