
బీహార్ ఆర్జేడీ నేత తేజస్విపై మహారాష్ట్రలో ఎఫ్ఐఆర్..కారణమేంటి?
‘‘"జుమ్లా" పదాన్ని వాడటం కూడా నేరమేనా? వాస్తవాలు మాట్లాడితే బీజేపీకి భయమెందుకు?’’- ప్రెస్‌మీట్‌లో తేజస్వి..
రాష్ట్రీయ జనతాదళ్(RJD) నేత తేజస్వి యాదవ్(Tejashwi Yadav)పై శనివారం (ఆగస్టు 23) ఎఫ్ఐఆర్ నమోదైంది. సోషల్ మీడియాలో ప్రధాని మోదీ(PM Modi)పై అభ్యంతరకర పోస్టు పెట్టినందుకు ఆయనపై కేసు నమోదైంది. మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మిలింద్ రామ్జీ నరోటే గడ్చిరోలి స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు కట్టారు. శుక్రవారం ప్రధాని మోదీ బీహార్(Bihar) రాష్ట్రం గయా జిల్లా పర్యటన సందర్భంగా తేజస్వి ఆయనపై అభ్యంతరకర పోస్టులు పెట్టాడని ఫిర్యాదుదారుడు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నాడు.
‘ఎఫ్ఐఆర్‌లకు భయపడం..’
అనంతరం కతిహార్‌లో తేజస్వి విలేఖరులతో మాట్లాడుతూ.. ‘‘"జుమ్లా" పదాన్ని వాడటం కూడా నేరమేనా? వాస్తవాలు మాట్లాడితే బీజేపీకి భయమెందుకు? ఈ ఎఫ్ఐఆర్‌లకు ఎవరూ భయపడరు," అని అన్నారు.
లాంతరు పాలనపై మోదీ ధ్వజం..
గయలో జరిగిన ర్యాలీలో ప్రధాని ఆర్జేడీని దుయ్యబట్టారు. బీహార్‌లో ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు శాంతిభద్రతలు క్షీణించాయని ధ్వజమెత్తారు. ఆర్‌జేడీ పాలనను "చీకటి యుగం"గా అభివర్ణించారు. "లాంతర్ (ఆర్‌జేడీ) పాలనలో ఇక్కడి పరిస్థితి మీకు గుర్తుండే ఉంటుంది. గయా వంటి నగరాలు అంధకారంలో ఉండేది. వారు మొత్తం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు." అని విమర్శించారు.
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు సహా ఉన్నతాధికారులు తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో 30 రోజులకు పైగా జైలు శిక్ష అనుభవిస్తే వారిని తొలగించే కొత్త అవినీతి నిరోధక చట్టాన్ని ఆర్జేడీ, కాంగ్రెస్, వ్యతిరేకిస్తున్నాయి. ఆ పార్టీలను లక్ష్యంగా చేసుకుని మోదీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ..
రాష్ట్రంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. కొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. గయ - ఢిల్లీ మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, వైశాలి - కోడెర్మా మధ్య బౌద్ధ సర్క్యూట్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.