ప్రైవేట్ విద్యాసంస్థల్లో రిజర్వేషన్ అమలుకు ఒత్తిడి తెస్తాం..
x

ప్రైవేట్ విద్యాసంస్థల్లో రిజర్వేషన్ అమలుకు ఒత్తిడి తెస్తాం..

బీహార్ పర్యటనలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..


ప్రైవేట్ విద్యాసంస్థల్లో రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం‌పై ఒత్తిడి తెస్తామని కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)హామీ ఇచ్చారు. కాంగ్రెస్ 'శిక్షా న్యాయ్ సంభాద్'(Shiksha Nyay Samvad) కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం బీహార్‌లో పర్యటించారు. ఈ సంవత్సరం అక్కడ అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరగనున్న విషయం తెలిసిందే.

రాహుల్‌ను అడ్డుకున్న పోలీసులు..

బీహార్ చేరుకున్న రాహుల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందు ఇచ్చిన అనుమతి రద్దు కావడంతో విద్యార్థులనుఉద్దేశించి ప్రసంగించేందుకు గురువారం పోలీసులు అనుమతించలేదు. దాంతో ఆయన అంబేద్కర్ హాస్టల్‌లోకి ప్రవేశించి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. "మీకు తెలిసే ఉంటుంది, నా కారును మిథిలా యూనివర్సిటీ గేట్ వద్ద ఆపేశారు. కానీ నేను ఆగలేదు. కిందకు దిగి పక్కదారిలో నడుచుకుంటూ వచ్చాను. బీహార్ పోలీసులు నన్ను ఆపాలని ప్రయత్నించారు. కానీ దేశ యువత నా వెంటే ఉందని వారికి తెలుసు. అందుకే ఆపలేకపోయారు," అని పేర్కొన్నారు. రాహుల్ ప్రసంగానికి అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ వేదిక చూసుకోవాలన్న పోలీసులు ప్రతిపాదనను వారు తిరస్కరించారు.

కార్పొరేట్లకు సేవ చేసేందుకే..

మోదీ ప్రభుత్వం అంబానీ, అదానీలాంటి కొంతమంది కార్పొరేట్ల ప్రయోజనాలకే పని చేస్తోందని రాహుల్ ఆరోపించారు. "వ్యవస్థ అంతా కూడా కేవలం 5 శాతం జనాభా ప్రయోజనాలకే పని చేస్తోంది. అందులో దళితులు, ఓబీసీలు, ఆదివాసీలకు ఏమాత్రం స్థానం లేదు’’ అని ధ్వజమెత్తారు. ‘‘ఎన్డీఏ నుంచి మీరు కొంతే ఆశించవచ్చు. కాని మేం బీహార్‌లోకాని, కేంద్రంలో గాని అధికారంలోకి వస్తే.. మీ హక్కుల్ని కాపాడుతాం," అని హామీ ఇచ్చారు.

రాహుల్ మూడు డిమాండ్లు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయించినట్లుగా..దేశవ్యాప్తంగా కుల గణన జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళికకు కేటాయించిన నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు.

ప్రసంగం చివర్లో రాహుల్ గాంధీ అంబేద్కర్ చిత్రపటాన్ని చూపించడంతో యువతీ యువకులంతా 'జై భీమ్'.. 'జై భీమ్'.. అంటూ నినాదాలు చేశారు.

Read More
Next Story