రైతుల దేశవ్యాప్త ఆందోళన
రైతులు(Farmers) మరోసారి ఆందోళన (Agitation)కు సిద్ధమవుతున్నారు.అయితే ఈ సారి గతంలో కంటే తమ ఆందోళన తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
తమ డిమాండ్లు నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని సంయుక్త కిసాన్ మోర్చా (SKM) హెచ్చరించింది. అయితే 2020-21లో ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన నిరసన కంటే ఈ ఆందోళన మరింత తీవ్రంగా ఉంటుందని పేర్కొంది.
శనివారం జరిగిన జాతీయ సమన్వయ కమిటీ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రైతులు నేషనల్ పాలసీ ఫ్రేమ్‌వర్క్ ఆన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ (NPFAM) రద్దు, స్వామినాథన్ కమిటీ ప్రతిపాదించిన C2 ప్లస్ 50 శాతం ఫార్ములా ఆధారంగా కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీ తదితర డిమాండ్లను కేంద్రం ముందు ఉంచనున్నారు. జనవరి 24న ఢిల్లీలో జరిగిన SKM జనరల్ బాడీ సమావేశంలో ఈ విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.
"2020-21లో ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన చారిత్రాత్మక రైతు ఉద్యమం కంటే ఇకముందు చేపట్టబోయేది చాలా పెద్దది. ప్రధాని మోదీ వచ్చే మూడు నెలల్లో NPFAM వంటి కార్పొరేట్ అనుకూల విధానాలను ఉపసంహరించేందుకు సిద్ధంగా లేకపోతే.. రైతులు దేశవ్యాప్త గ్రామీణ హర్తాల్ నిర్వహించి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లాల్లో ట్రాక్టర్, మోటార్‌సైకిల్ పరేడ్‌లో రైతులు విస్తృతంగా పాల్గొనాలని రైతులను ఆహ్వానించాం.’’అని SKM నేతలు పేర్కొన్నారు. ఎంపీలు కూడా రైతులకి మద్దతు ఇవ్వాలని కోరుతూ, వారి నివాసాలు/కార్యాలయాల వద్ద విస్తృతంగా ప్రతినిధులను పంపుతామని SKM ప్రకటించింది.