Farmers March | భాష్పవాయువు ప్రయోగంతో గాయపడ్డ రైతులు
ఢిల్లీకి బయల్దేరిన 101 మంది రైతుల సమూహాన్ని శనివారం మధ్యాహ్నం శంభు సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రైతుల పాదయాత్రను అడ్డుకోవడం ఇది మూడోసారి.
రైతులు శంభు సరిహద్దు నుంచి ఢిల్లీకి చేపట్టిన పాదయాత్రను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. భద్రతా బలగాలు వారిని అడ్డుకోవడం ఇది మూడోసారి. దేశరాజధాని వైపునకు వెళ్లనివ్వకపోవడంతో నిరసన తెలిపిన రైతులను చెదరగొట్టేందుకు హర్యానా భద్రతా సిబ్బంది బాష్పవాయువుతో పాటు వాటర్ క్యానన్లను ప్రయోగించారు. భాష్పవాయువు ప్రయోగంతో కొంతమంది రైతులు గాయపడ్డారు. వారిని సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
కనీస మద్దతు ధరతో పాటు పలు డిమాండ్ల పరిష్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దేశ రాజధానికి రైతులు డిసెంబర్ 6న పాదయాత్ర మొదలుపెట్టారు. డిసెంబరు 6, డిసెంబర్ 8 తేదీల్లో రెండుసార్లు హర్యానాలో భద్రతా సిబ్బంది వారికి ముందుకెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు.
ఫలించని ప్రయత్నం..
అంతకుముందు అంబాలా డిప్యూటీ కమిషనర్ పార్త్ గుప్తా, అంబాలా పోలీసు సూపరింటెండెంట్ ఎస్ఎస్ భోరియా రైతులతో మాట్లాడారు. దేశ రాజధాని వైపు వెళ్లడానికి ఢిల్లీ నుంచి అనుమతి తీసుకోవాలని కోరారు. అయినా ఫలితం లేకుండా పోయింది. తమను ముందుకెళ్లేందుకు అనుమతించాలని భద్రతా సిబ్బందిని కోరుతూ.. కొన్ని మీటర్ల దూరం ముందుకెళ్లిన రైతులను హర్యానా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్..
హర్యానా ప్రభుత్వం అంబాలాలోని 12 గ్రామాలలో మొబైల్ ఇంటర్నెట్, బల్క్ SMS సేవలను డిసెంబర్ 17 వరకు నిలిపివేసింది. ప్రజా శాంతిని కాపాడేందుకు శనివారం తెల్లవారుజామున సేవలను నిలిపివేసినట్లు అదనపు ప్రధాన కార్యదర్శి (హోమ్) సుమితా మిశ్రా పేర్కొన్నారు.
సెక్షన్ 163 అమలు..
శనివారం రోజు రైతుల మార్చ్‌ను అడ్డుకోడానికి హర్యానా భద్రతా సిబ్బంది భారీ బారికేడ్లను అమర్చారు. జిల్లాలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడటాన్ని నిషేధిస్తూ..అంబాలా జిల్లా యంత్రాంగం ఇప్పటికే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 విధించింది.
అందాక పాదయాత్ర ఆగదు..
తమ సమస్యలపై చర్చలు జరిపే వరకు ఢిల్లీకి రైతుల పాదయాత్ర కొనసాగుతుందని కిసాన్ మజ్దూర్ మోర్చా (కెఎంఎం) నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ ఇప్పటికే పేర్కొన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీతో పాటు ఇతర డిమాండ్ల కోసం సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కెఎంఎం నేతృత్వంలో రైతులు ఢిల్లీ చలో కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.
19వ రోజుకు దల్లేవాల్ దీక్ష..
కాగా.. ఖనౌరీ సరిహద్దు పాయింట్ వద్ద రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారానికి 19వ రోజుకు చేరుకుంది. ఆమరణ దీక్ష కారణంగా ఆయన శరీరంలో గ్లూకోస్ లెవెల్స్ పడిపోయాయని, వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్చాలని వైద్యులు తెలిపారు. పోలీసులు దల్లేవాల్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లనివ్వకుండా రైతులు భద్రతా వలయాన్ని ఏర్పడ్డారు. నవంబర్ 26న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టానికి కొద్ది గంటల ముందు ఖానౌరీ సరిహద్దు పాయింట్ నుంచి దల్లేవాల్‌ను పంజాబ్ పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు.
Farmers' protestపంటలకు కనీస మద్దతు ధర, పంటల రుణమాఫీ, రైతులు, రైతు కూలీలకు పెన్షన్, విద్యుత్ ఛార్జీల పెంపు ఉపసంహరణ, రైతులపై పోలీసు కేసుల ఉపసంహరణ, 2021 లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం, 2013 భూసేకరణ చట్టం పునరుద్ధరణ, 2020-21 ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపు.